బీజేపీ మహిళా నేత కుష్బూ అరెస్ట్  

ప్రముఖ నటి, బీజేపీ మహిళా నేత కుష్బూను పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. మహిళలపై వీసీకే అధ్యక్షుడు తిరుమావళన్‌ వ్యాఖ్యలకు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో పాల్గొనడానికి వెళ్తున్న కుష్బూను ఈసీఆర్‌ రోడ్డులో చెంగ‌ల్‌ప‌ట్టు పోలీసులు అరెస్టు చేశారు.

ఈ తరుణంలో గౌండంబాడిలో వీసీకే, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పరస్పరం చెప్పులు నేతలు విసురుకున్నారు. ఈ ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీగా మోహరించిన పోలీసులు 15 మంది బీజేపీ నేతలను అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కుష్బూ బీజేపీలో చేరారు. నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా.. సోమవారం  కూడా తిరుమాళవన్‌కు వ్యాఖ్యలు నిరసనగా బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలతో ఆందోళన చేపట్టగా వారితో డీపీఐ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలతో హోరెత్తించారు.

ఒకానొక సమయంలో ఒకరిపై ఒకరు రాళ్లు కూడా రువ్వుకున్నారు. ఈ దాడిలో పోలీసులు, ఇరువర్గాలకు చెందిన వాహనాల అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితి చేజారుతుందని భావించిన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానికంగా కళ్యాణమండపాలకు తరలించారు.

మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆయా ప్రాంతంల్లో పోలీసులు భారీగా మోహరించారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు, నేతలు మాత్రం ఇవాళ కూడా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.