కమల్‌ నాథ్‌కు ఎన్నికల కమీషన్ నోటీసు  

బీజేపీ నాయకురాలు, మధ్య ప్రదేశ్ మంత్రి ఇమర్తి దేవి నుద్దేశించి ఆయన చేసిన ‘ఐటమ్‌’ వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌ నాథ్‌కు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసు జారీ చేసింది. 
మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున పార్టీల మధ్య ఉన్న విభేదాలను తీవ్రం చేయడం లేదా, పరస్పర ద్వేషాన్ని సృష్టించే లేదా వివిధ కులాలు, వర్గాల మధ్య ఉద్రిక్తతకు కారణమయ్యే ఏ చర్యలోనూ ఏ పార్టీ లేదా వ్యక్తులు పాల్గొనకూడదని స్పష్టం చేసింది. ఈ నియమాన్ని ఉల్లంఘించిన కమల్‌ నాథ్‌ నుంచి వివరణ కోరింది. 
గ్వాలియర్‌లోని డాబ్రా పట్టణంలో ఆదివారం ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన కమల్‌ నాథ్‌, బీజేపీ అభ్యర్థిని ఇమర్తి దేవిపై విమర్శలు చేశారు. ఆమె మాదిరిగా ‘ఐటమ్‌’ కాకుండా కాంగ్రెస్‌ అభ్యర్థి చాలా సాధారణ వ్యక్తి అని చెప్పారు. దీంతో కమల్‌ నాథ్‌ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది.
ఆయనను పార్టీ నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ లేఖ రాశారు. బీజేపీ నేతలు ఆయనపై మండిపడటంతోపాటు నిరసనలు తెలిపారు. కమల్‌ నాథ్‌ వ్యాఖ్యలను రాహుల్‌ గాంధీ కూడా ఖండించారు. ఆయన అలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. 
 
కాగా జాతీయ మహిళా కమిషన్‌ కూడా దీనిపై కమల్‌ నాథ్‌ నుంచి వివరణ కోరింది. అయితే తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు కమల్‌ నాథ్‌ తెలిపారు. ఆమెను కించపరిచేలా తాను మాట్లాడలేదని, పేరు గుర్తుకురాకపోవడంతో ఈ విధంగా (ఐటమ్‌) అన్నానని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.