బీజేపీ-జేడీ(యూ) జోడీ సూపర్ హిట్

క్రికెట్‌‌లో సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ జోడీలా బీజేపీ-జేడీయూ పొత్తు సూపర్ హిట్ జోడి అవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బిహార్‌‌లోని భగల్‌‌పూర్‌‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన  పాల్గొంటూ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా  ఉంటే ప్రభుత్వంలో అవినీతికి ఎలాంటి ఆస్కారం ఉండబోదని స్పష్టం చేశారు.

‘నితీశ్ కుమార్‌‌కు బిహార్‌‌కు కావాల్సినవన్నీ చేశారని నేను చెప్పట్లేదు. ఆయన ఎక్కువ పని చేశారా, తక్కువ చేశారా, లేదా ఇంకా ఎక్కువ చేయాల్సిందా అనేది చర్చించాల్సిన అంశం. కానీ ఆయన నిజాయితీని మాత్రం శంకించాల్సిన పని లేదు, దానిపై చర్చ కూడా అనవసరం’ అని రాజ్‌‌‌నాథ్ చెప్పారు.  
 
విపక్ష ఆర్జేడీపై రాజ్‌నాథ్ ఈ సందర్భంగా విమర్శలు గుప్పిస్తూ, ప్రజలు ఆర్జేడీ 15 ఏళ్ల పాలనను చూశారని, ఆర్జేడీ అవకతవకల పాలనకూ, నితీష్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అందించిన సుపరిపాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వారు గమనించ వచ్చని పేర్కొన్నారు. 
 
బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వం విద్యుత్, రోడ్లు, నీళ్లు వంటి కనీస సౌకర్యాలను ప్రజలందిరికీ కల్పించిందని చెప్పారు. దశాబ్దాలుగా బీహార్ ప్రజలు వీటికి నోచుకేలేదని గుర్తు చేశారు.
 
 ’15 ఏళ్ల లాంతర్ (ఆర్జేడీ గుర్తు) పాలనను ప్రజలు చూశారు. బీజేపీ-జేడీయూ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధినీ చూశారు. రెండు ప్రభుత్వాల పనితీరును ఏమాత్రం పోల్చలేం. రాష్ట్రం రూపురేఖలు ఎన్డీయే ప్రభుత్వం సమూలంగా మార్చేసింది’ అని సింగ్ తెలిపారు.
 
ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి-బీజేపీ నేత సుశీల్ మోదీలపై రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపిచారు. వారిపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని చెప్పారు. స్థానిక భోజ్‌పురి భాషలో ఆయన మాట్లాడుతూ..’లాంతరు చిట్లింది. కిరోసిన్ కారిపోయింది. ఇప్పుడు ఏమాత్రం పనిచేయడం లేదు’ అని ఆర్జేడీపై చతురోక్తులు విసిరారు. 
 
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన వంటి వివిధ సంక్షేమ పథకాలను కూడా రాజ్‌నాథ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
 
తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘటనలో అమరులైన బీహార్ రెజిమెంట్ సైనికుల త్యాగనిరతని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సాహసవీరులను అందించిన బీహార్ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.