పాక్ లో అంతర్యుద్ధం… సైన్యం, పోలీసుల కాల్పులు

ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్‌ క్రమంగా అంతర్యుద్ధం దిశగా పయనించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనాతో దేశం అతలాకుతలం అవుతుండగా మరోపక్క ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. ఆర్మీకి, పాక్‌ పోలీసులకు మధ్య ఘ్రాషణలు పెరిగి కాల్పులకు దారితీశాయి. 
 
ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ తన తాజా ట్వీట్‌లో పాక్‌లో సివిల్‌ వార్‌ ఆరంభమైందని వ్యాఖ్యానించింది.  కరాచీలో సింధ్‌ పోలీసులకు, పాక్‌ ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు పది మంది పోలీసులు మరణించినట్లు తెలిపింది. సింధ్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ముష్టాఖ్‌ అహ్మద్‌ మహర్‌ను ఆర్మీ నిర్బంధించడంతో ఘర్షణ మొదలైంది. ఈ సందర్భంగా ఐదుగురు సైనికులు కూడా చనిపోయిన్నట్టు చెబుతున్నారు.
ఒక వంక ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రజలలో అసంతృత్తి పెరుగుతూ ఉండడం, 13 ప్రతిపక్షాలు కలసి భారీ నిరసన ప్రదర్శనలు జరుపుతూ ఉండగా, మరోవంక  ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న సైన్యంపై సహితం ప్రజలలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.
శుక్రవారం కరాచీలో 13 ప్రతిపక్షాల సంయుక్త ర్యాలీ ముగిశాక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు,  పీఎంఎల్‌ నేత మరియం నవాజ్‌ భర్త సఫ్దర్‌ అవాన్‌ను ఆర్మీ అదుపులోకి తీసుకుంది. తమకు చెప్పకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారని సింధ్‌ పోలీసులు ప్రశ్నించారు. 
 
దీంతో పారామిలటరీ దళాలు సోమవారం సింధ్‌ ఐజీ ముస్తాక్‌ మెహర్‌ ఇంటిపై దాడి చేసి ఆయనను కిడ్నాప్‌ చేశాయి. సఫ్దర్‌ అవాన్‌ను అరెస్ట్‌ చేయాల ని తానే ఆదేశాలిచ్చినట్లు ఆయనచేత బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించింది. దీంతో సింధ్‌ పోలీసులు భగ్గుమన్నారు. వందల మంది అధికారులు, పోలీసులు సామూహిక సెలవుకు దరఖాస్తు చేశారు.
 
కాగా ఈ ఘటనలపై పాక్‌ ప్రధాని, ప్రభుత్వం స్పందించలేదు. పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇటీవల ఏర్పాటు చేసిన పీడీఎం వేదికపై నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం, ఆమె భర్త సఫ్దార్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
పాక్‌ ఆర్మీకి నచ్చని ‘ఓటుకు విలువ ఇవ్వండి’ అని సఫ్దార్‌ నినాదాలు చేశారని, దీంతో కేసు నమోదైందని తెలిసింది. ఈ కేసులోనే సఫ్దార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తక్షణమే సఫ్దార్‌ను అరెస్ట్‌చేసేలా పోలీసులకు ఉత్వర్వులు ఇవ్వాలని సింధ్‌ పోలీస్‌ ఐజీపీ మహర్‌పై సైన్యం ఒత్తిడి చేసిందని, అందుకోసం ఆయనను సైన్యం నిర్బంధించిందని సింధ్‌ మాజీ గవర్నర్‌ మహ్మద్‌ జుబేర్‌ ఆరోపించారు.
పోలీస్‌ ఉన్నతాధికారి అయిన మహర్‌ నిర్బంధం విషయం తెల్సి ఆర్మీపై పోలీసులు తిరగబడ్డారు. ఈ సందర్భంగా సైన్యం, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగాయని, పది మంది పోలీసులు మరణించారని తెలుస్తోంది. సైన్యం కాల్పులకు నిరసనగా ఏఐజీ ఇమ్రాన్‌సహా సీనియర్‌ పోలీసు అధికారులు విధులను బహిష్కరించి సెలవు తీసుకున్నారు.
అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో మహర్‌ తన సెలవును వాయిదా వేసుకున్నారు. 10 రోజులదాకా సెలవు  కోసం దరఖాస్తు చేసుకోరాదని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ గొడవకు కారణమైన అంశాలపై విచారణ జరపాలని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమార్‌జావెద్‌ బజ్వా ఆదేశించారు.ఇటీవల
పాక్‌లో జరిగిన భారీ నిరసనల్లో భారత జాతీయజెండాలు చేతబూనారని బుధవారం ట్విట్టర్‌లో కొంతమంది పోస్ట్‌లు పెట్టారు. వేలాది మంది జనం గుమికూడిన ఈ ఫొటోల్లో కొందరి చేతిలో మువ్వన్నెల జెండాలున్నాయి. పాక్‌కు చెందిన పాకిస్తాన్‌ అవామీ తెహ్రీక్‌ పార్టీ జెండాలో అవే రంగులుంటాయని, అవి ఆ జెండాలని కొందరు స్పందించారు.
 పాక్‌లో ప్రభుత్వ అసమర్థత కారణంగా ఆహార కొరత వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో సామాన్యుల జీవనం అస్తవ్యస్థంగా మారింది. నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్రాన్‌ గద్దె దిగాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆందోళనలను అణిచివేస్తోంది.