తెలంగాణ తొలి హోంమంత్రి నాయని కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, కార్మిక నాయకుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని  నర్సింహారెడ్డి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. వారంరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కుటుంబసభ్యులు  అపోలో దవాఖానకు తరలించారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. 

బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అపోలో దవాఖానలో నాయినిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కానీ రాత్రి పొద్దుపోయాక నాయిని ఆరోగ్యం క్షీణించింది. నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిరకాల మిత్రుడు, ఉద్యమ సహచరుని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.  నాయిని మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి, తెలంగాణ రాష్ర్టానికి, కార్మిక లోకానికి తీరనిలోటని పేర్కొన్నారు. 

తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి 1934 మే 12న నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరడుగొమ్ము గ్రామంలో దేవయ్యరెడ్డి, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య అహల్యారెడ్డి, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమంతరెడ్డి ఉన్నారు. హెచ్‌ఎస్‌సీ వరకు విద్య నభ్యసించిన నాయిని 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 

1969లో జయప్రకాశ్‌నారాయణ శిష్యుడిగా సోషలిస్ట్ రాజకీయాలలో ప్రవేశించారు. జనతాపార్టీ అభ్యర్థిగా 1978, 1985లలో ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  1978లో తొలిసారిగా పోటీచేసి కాంగ్రెస్ (ఇందిరా) దిగ్గజం టి అంజయ్య, కాంగ్రెస్ (ఆర్) అభ్యర్థి, ప్రముఖ కార్మిక నేత సంజీవరెడ్డి లను ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా అప్పట్లో సంచలనం సృష్టించారు.

2004లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 జూన్‌ 2న ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 

గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఎంపికైన ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్‌తో ముగిసింది. నాయిని నర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన నాటినుంచి తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే నడిచారు. 

1970లో హైదరాబాద్‌ వచ్చిన నాయిని నర్సింహారెడ్డి ముషీరాబాద్‌ నియోజకవర్గం సమీపంలోని బర్కత్‌పురలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌ కేంద్రంగా కార్మిక ఉద్యమాలు చేసిన ఆయన నాడు ముంబైలో రిక్షా పుల్లర్‌ యూనియన్‌కు కూడా నాయకత్వం వహించారు. 1977 ఎమర్జెన్సీ సమయంలో హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ముంబై తదితర ప్రాంతాల్లో పలు ఆందోళనల్లో పాల్గొన్నారు. 

ఎమర్జెన్సీ ముందు సమయంలో రైల్వేచరిత్రలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణ రైల్వే బంద్‌ను జయప్రదం చేయడంలో కీలకంగా వ్యహరించారు. ఎమర్జెన్సీ సమయంలో మీసా క్రింద అరెస్ట్ అయి చంచలగూడ జైలులు ఉన్నారు. హైదరాబాద్‌లోని వీఎస్టీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్మికుల కోసం రవాణా, క్యాంటీన్‌ వసతిని ఏర్పాటుచేయించారు. 

హైదరాబాద్‌లోని వీఎస్టీలో కార్మికనేతగా ప్రత్యేక గుర్తింపు పొందిన నాయిని.. కార్మికుల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. హైదరాబాద్‌తోపాటు శివారుల్లోని పలు కంపెనీల్లో ఆయన కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. వీఎస్టీలో కార్మిక సంఘానికి సలహాదారుడిగా కొనసాగుతున్న నాయిని నర్సింహారెడ్డి కార్మికుల సంక్షేమం కోసం చివరిదాకా పాటుపడ్డారు.