సీఏఏ అమలు త్వరలో… నడ్డా హామీ  

 కోవిడ్‌-19తో జాప్యం నెలకొన్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) త్వరలో అమలవుతుందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో సామాజిక్‌ సమూహ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సీఏఏతో దేశ ప్రజలందరికీ మేలు చేకూరుతుందని, దీనికోసం బీజేపీ కట్టుబడిఉందని చెప్పారు. 

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై నడ్డా విమర్శలతో విరుచుకుపడుతూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో విభజించి పాలించే రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. బీజేపీ దేశ ప్రజలందరి వికాసానికి పాటుపడుతుందని చెప్పారు. 

పశ్చిమ బెంగాల్‌లో పీఎం-కిసాన్ సమ్మన్ నిధి యోజన అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదని నడ్డా ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్రంలోని రైతులందరికీ ఈ పథకాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021 కు సంబంధించి సంస్థాగత విషయాలను తెలుసుకోవడంలో భాగంగా జేపీ నడ్డా  ఉత్తర బెంగాల్‌లో పర్యటించి వివిధ గ్రూపులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఎఫ్‌పీఓలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం లక్ష కోట్ల రూపాయలు అందించామని, రైతుల కోసం కోల్డ్ స్టోరేజీలు, జనరల్ స్టోరేజీలు నిర్మిస్తామని నడ్డా చెప్పారు. 

పశ్చిమ బెంగాల్ స్థానిక ఉత్పత్తుల జాబితాను తయారు చేసి, వాటిని మార్కెటింగ్ చేయడానికి రోడ్‌మ్యాప్‌ రూపొందించాలని బీజేపీ ఎంపిలను ఆయన కోరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్థానిక ఉత్పత్తులను సరైన బ్రాండ్ చేసి రాష్ట్రంలోని స్థానిక వ్యాపారులకు మార్కెట్ తెస్తుందని నడ్డా హామీ ఇచ్చారు.