చైనాకు చెక్… మలబార్‌ నౌకా విన్యాసాల్లో ఆస్ట్రేలియా    

చైనాకు చెక్… మలబార్‌ నౌకా విన్యాసాల్లో ఆస్ట్రేలియా    

చైనా దూకడుకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ మరో అడుగు ముందుకేసింది. వచ్చే నెలలో జరుగనున్న మలబార్‌ నౌకా విన్యాసాల్లో పాల్గోవాలని ఆస్ట్రేలియాను ఆహ్వానించింది. ‘సముద్ర భద్రతలో ఇతర దేశాల సహకారాన్ని పెంచడానికి భారతదేశం ప్రయత్నిస్తున్నది. 

ఆస్ట్రేలియాతో రక్షణ సహకారం పెరిగిన నేపథ్యంలో మలబార్ 2020 విన్యాసాల్లో ఆ దేశ నౌకాదళం కూడా పాల్గొంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ  ప్రకటించింది. 1992లో ప్రారంభమైన తొలి మెగా నౌకా విన్యాసాల్లో భారత్‌, అమెరికా నౌకలు పాల్గొన్నాయి. 2015లో జపాన్‌ నౌకలు కూడా ఈ విన్యాసాల్లో భాగమయ్యాయి. 

2019 సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌ తీరంలో సంయుక్త విన్యాసాలు జరిగాయి. తాజాగా 2020 మలబార్‌ విన్యాసాల్లో ఆస్ట్రేలియా నౌకలు కూడా పాల్గోనున్నాయి. కాగా, ఇండో-పసిఫిక్‌ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్‌ నావిగేషన్‌ భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్టేలియా దేశాల భాగస్వామ్య లక్ష్యమని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సముద్ర ప్రాంతంపై చైనా ఆధిపత్యానికి చెక్‌ చెప్పనున్నట్లు పరోక్షంగా పేర్కొన్నారు.  

మరోవైపు మలబార్‌ నౌకా విన్యాసాలు రెండు దశల్లో జరుగనున్నాయి. నవంబర్‌ 3 నుంచి 6 వరకు, తిరిగి నవంబర్‌ 17 నుంచి 20 వరకు జరుగుతాయి. ఒక భాగం విన్యాసాలను బంగాళాఖాతంలోని అండమాన్‌ నికోబార్‌ దీవులకు ఉత్తరాన, మరో భాగం విన్యాసాలను అరేబియా సముద్రంలో నిర్వహిస్తారు. 

భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్టేలియా విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 6న జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగింది. ఈ నెల 26-27న భారత్‌, అమెరికా మధ్య టు ప్లస్‌ టు చర్చలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జియో-ప్రాదేశిక ఒప్పందం (బీఈసీఏ)పై సంతకాలు జరుగవచ్చని సమాచారం. 

దీని అనంతరం నవంబర్‌ నెలలో నాలుగు దేశాలు కలిసి మలబార్‌ నౌకా విన్యాసాల్లో పాల్గొననున్నాయి. భారత్‌, చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నాలుగు దేశాలు కలిసి మెగా నౌకా విన్యాసాలు జరుపడం ప్రాధాన్యత సంతరించుకున్నది.