మ‌హిళ‌ల భ‌ద్ర‌తకు యోగి ప్రారంభించిన మిష‌న్ ‌శ‌క్తి  

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం మిష‌న్ శ‌క్తి  కార్యక్రమాన్ని ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ ప్రారంభించారు. అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలికి నివాళిగా బ‌ల‌రాంపూర్ నుంచి మిష‌న్ శ‌క్తి క్యాంపెయిన్ మొద‌లు పెడుతున్నామ‌ని ఈ సందర్భంగా యోగి చెప్పారు. 
 
ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని ఆదిత్య‌నాథ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్ర‌తి మ‌హిళ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం, ప్ర‌తి మ‌హిళ‌ను గౌర‌వం పొందేలా చూడం మిష‌న్‌శ‌క్తి కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశ‌మ‌ని ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. 
 
మ‌హిళా ఫిర్యాదు దారుల కోసం రాష్ట్రంలోని 1535 పోలీస్‌స్టేష‌న్‌ల‌లో ప్ర‌త్యేక గ‌దుల‌ను ఏర్పాటు చేయిస్తామ‌ని యూపీ సీఎం వెల్ల‌డించారు. అక్క‌డ ఉండే మ‌హిళా కానిస్టేబుల్ వారి ఫిర్యాదును రాసుకుంటార‌ని చెప్పారు. 
 
ఆ ఫిర్యాదుల‌పై పోలీసులు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుంటార‌ని, దీంతో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డే నేర‌గాళ్ల‌కు త్వ‌ర‌గా శిక్ష‌లు ప‌డుతాయ‌ని యోగీ అభిప్రాయ‌ప‌డ్డారు.