మహారాష్ట్ర మంత్రికి మూడు నెలల జైలుశిక్ష  

మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి యశోమతి ఠాకూర్‌కు అమరావతి కోర్టు మూడు నెలల జైలుశిక్ష విధించింది. అలాగే, రూ.15 వేల జరిమానా కూడా వేసింది. యశోమతి ఠాకూర్ డ్యూటీలో ఉన్న ఒక పోలీసును చెంపదెబ్బ కొట్టిన కేసులో అభియోగాలను ఎదుర్కొన్నారు. 
 
యశోమతి ఠాకూర్ అమరావతి జిల్లా సంరక్షక మంత్రిగా  కూడా ఉన్నారు. ఎనిమిదేండ్ల క్రితం యశోమతి ఠాకూర్ అమరావతి జిల్లాలోని అంబాదేవి ఆలయం సమీపంలో ఉల్హాస్ రౌరాలే అనే పోలీసును చెంపదెబ్బ కొట్టారు. 
 
ఈ సమయంలో ఆమె కారు డ్రైవర్, మరో ఇద్దరు మద్దతుదారులు కూడా ఆ పోలీసుపై చేయిచేసుకున్నారు. సదరు పోలీసు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అమరావతి పోలీసులు మంత్రి యశోమతిపై కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. 
 
ఈ కేసులో మంత్రితోపాటు మిగతా వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. “నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఈ నిర్ణయం 8 సంవత్సరాల తరువాత వచ్చింది. 
 
కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు అప్పీల్ చేస్తాను” అని ఆమె కోర్ట్ తీర్పు తర్వాత చెప్పారు.  మహారాష్ట్రలోని తేవ్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభయార్దిగా యశోమతి ఠాకూర్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.