ఆర్ఎస్ఎస్ రాజకీయ అధికారం కోసం పనిచేయదు

ఆర్ఎస్ఎస్ రాజకీయ అధికారం కోసం పనిచేయదు
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రాజకీయ అధికారం కోసం గానీ, లేదా ఎవరికైనా వ్యతిరేకంగా గానీ పనిచేయడం లేదని సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఈ సంస్థ రాజకీయ అధికారం కోసం లేదా ఏ వ్యక్తి, సమూహం లేదా మతానికి వ్యతిరేకంగా పనిచేయడం లేదని ఆయన తెలిపారు. గత వంద ఏళ్లుగా, ఆర్ఎస్ఎస్ కేవలం భారత్ శ్రేయస్సు, సంక్షేమం కోసం, తద్వారా ప్రపంచ శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. 
 
“ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు” అంశంపై కేరళంలోని త్రిసూర్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మతం, కులం, ప్రాంతం లేదా భాష ఆధారంగా ఆర్ఎస్ఎస్ ఎవరినీ పరాయివారిగా పరిగణించదని,  ‘అంతా ఒక్కటే’ అనేది దాని దృక్పథం అని తెలిపారు. “హిందుత్వ” అనే పదం భారత్ జీవన సంప్రదాయాన్ని సూచిస్తుందని, ఆ కోణంలో మనమందరం హిందువులమేనని ఆయన చెప్పారు. ఏ మతాన్ని లేదా దేవుని ఏ రూపాన్ని విశ్వసించేవారైనా సరే, ఈ సాంస్కృతిక కోణంలో హిందువులే అవుతారని తెలిపారు.  
 
వైవిధ్యం అనేది మానవ జీవితంలో సహజమైన భాగమని, ఆ వైవిధ్యం మధ్య ప్రజలను ఏకం చేసే అంశం ‘ధర్మం’ అని సర్ సంఘచాలక్ తెలిపారు. ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడే మానవ విలువలే హిందూ ధర్మం అని ఆయన వివరించారు. భిన్నత్వాలు ఉన్నప్పటికీ, ఈ విలువలే భారత్ బలానికి, ఐక్యతకు మూలాధారాలని చెప్పారు. సత్యం, కరుణ, పవిత్రత, తపస్సు ధర్మానికి పునాదులని ఆయన పేర్కొన్నారు. 
 
ధర్మానికి, ఏదైనా నిర్దిష్ట పూజా విధానానికి సంబంధం లేదని పేర్కొంటూ   అటువంటి విలువలను ఆచరించే వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు సానుకూల సామాజిక పరివర్తన జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ అటువంటి వ్యక్తులను తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల ఉద్దేశమని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యకలాపం దాని దైనందిన శాఖలను నిర్వహించడమేనని ఆయన తెలిపారు. 
 
ఈ కార్యకలాపాల ద్వారా తయారైన వ్యక్తులు వివిధ రంగాలలో సామాజిక పరివర్తన కోసం కృషి  చేస్తారని చెబుతూ వివిధ రంగాల్లోని కార్యకలాపాలు పారదర్శకంగా,  స్వతంత్రంగా నిర్వహిస్తారని, వాటిని ఆర్ఎస్ఎస్ నియంత్రించే ప్రయత్నం చేయదని డా.  భగవత్ స్పష్టం చేశారు. సేవా భారతి వంటి సంస్థలు కూడా స్వతంత్రంగా పనిచేస్తాయని ఆయన జోడించారు. ఆర్ఎస్ఎస్ నుండి పొందిన సైద్ధాంతిక స్ఫూర్తి తప్ప, వివిధ సంస్థలలోని ఎవరిపైనా ఎటువంటి నియంత్రణ ఉండదని చెప్పారు. 
 
కేవలం దూరంగా ఉండి విమర్శించడం ద్వారా ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోలేమని తెలిపారు. ఎవరైనా వచ్చి, స్వయంగా చూసి, లోపలి నుండి దానిని అర్థం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉందని, అలా చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేవని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ను దాని కార్యకలాపాల ద్వారా, దాని స్వయంసేవకుల జీవితాల ద్వారా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. 
 
“హిందుత్వ అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదు. అది భారతదేశపు సజీవ నాగరికతా సంప్రదాయం. హిందవీ క్రైస్తవులు, హిందవీ ముస్లింలు ఈ సంప్రదాయంలో అంతర్భాగం. సంఘ్ మైనారిటీలు, మెజారిటీల మధ్య ఎటువంటి భేదం చూపదు. అది అందరినీ సమానంగానే చూస్తుంది” అని  ఆయన వివరించారు. మన సంస్కృతి రాజ్యం చుట్టూ కాకుండా, సమాజం చుట్టూ అల్లుకుని ఉంటుందని తెలిపారు. 
 
నిజాయితీ, పారదర్శకతతో జీవిస్తూ, అందరి శ్రేయస్సు కోసం నిస్వార్థంగా పనిచేసే ఎవరైనా స్వయంసేవకే అని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ లో ఎటువంటి అధికారిక సభ్యత్వ విధానం లేదని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ తప్పనిసరిగా నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబడుతోందన్న వార్తలపై స్పందిస్తూ, గత వంద ఏళ్లుగా ఈ సంస్థ ఎటువంటి నమోదు లేకుండానే పనిచేసిందని, ఇకపైనా అలాగే కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.
 
నమోదు చేసుకోవాలన్న డిమాండ్ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, అది ఎక్కువ కాలం నిలవదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఉన్న అనేక అపోహల గురించి ప్రస్తావిస్తూ, “రండి, మమ్మల్ని చూడండి, అర్థం చేసుకోండి, ఆ తర్వాతే మా గురించి మీ అభిప్రాయాన్ని ఏర్పరచుకోండి” అని ఆయన కోరారు. సంస్థ పనితీరును, స్వయంసేవకుల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఈ సంస్థను అర్థం చేసుకోగలమని ఆయన పేర్కొన్నారు.