అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం స్వాగ‌తించిన ప్ర‌ధాని మోదీ

అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం స్వాగ‌తించిన ప్ర‌ధాని మోదీ
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్‌లు ఒక అంగీకారానికి రావడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా అనేక దేశాల్లో ప్రాణనష్టం సంభవించిందని ఆయన పేర్కొన్నారు.  ప్రాంతీయ శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణకు ఈ పరిణామం కీలకంగా మారుతుందని తెలిపారు.
ముఖ్యంగా అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్య కార్యకలాపాలకు భరోసా కల్పించడంలో ఇది సానుకూల ఫలితాలు ఇస్తుందని భారత్ విశ్వసిస్తోందని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్’​లో పోస్ట్​ చేశారు.  ఆ ఒప్పందం అమ‌లు వ‌ల్ల ప‌శ్చిమాసియాలో శాంతి స్థాప‌న జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో మ‌ళ్లీ స్థిర‌త్వం వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.
ఇక ఒప్పందం కుద‌ర‌ని అంశాల‌పై కూడా స‌మ‌గ్ర‌మైన అగ్రిమెంట్ జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  నిరంత‌ర చ‌ర్చ‌ల ప్ర‌క్రియ ద్వారా వాషింగ్ట‌న్, టెహ్రాన్ త‌మ మ‌ధ్య ఉన్న విబేధాల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని ప్ర‌ధాని మోదీ సూచించారు.  

ఈ పరిణామాలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జయస్వాల్, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత్ స్వాగతిస్తోందని తెలిపారు. “ఈ ఒప్పందంతో హర్మూజ్ జలసంధిలో నౌకాయానం నిరాటంకంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. శాంతి, ప్రాంతీయ స్థిరత్వం కోసం చేపట్టే ప్రతి చర్యకు భారత్ మద్దతుగా ఉంటుంది. ఈ పరిణామాలను స్ఫూర్తిగా తీసుకుని రష్యా-ఉక్రెయిన్ కూడా శాంతి ప్రయత్నాల దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నాం” అని పేర్కొన్నారు.

నావిగేషన్ స్వేచ్ఛను నిర్ధారించడానికి హార్ముజ్ తెరిచి ఉండాలని భారతదేశం ఎల్లప్పుడూ కోరుతూనే ఉంది, అయితే అన్ని వైరుధ్యాలను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పింది. ప్రధాని మోదీ గత మూడు నెలలుగా ప్రపంచ నేతలతో పలుమార్లు కాల్‌లు జరిపారు, ఈ వివాదంపై భారత్ వైఖరిని పునరుద్ఘాటించారు.

కాగా ఈ ఒప్పందం నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దెబ్బతీయడానికి ప్రయత్నించారని ట్రంప్ ఆరోపించారు. లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి కారణంగానే వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదరడంలో జాప్యం జరిగిందని విమర్శించారు. ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రతినిధులతో ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.