వాటర్ గ్రిడ్ కోసం ఉద్ధవ్‌కు గడ్కరి లేఖ

మహారాష్ట్రలో ఏటా సంభవిస్తున్న వరదల్లో విలువైన ప్రాణాలు, ఆస్తి నష్టం సంభవించకుండా ‘స్టేట్ వాటర్ గ్రిడ్’ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నేషనల్ పవర్ గ్రిడ్, హైవే గ్రిడ్ తరహాలో రాష్ట్ర వాటర్ గ్రిడ్ ఏర్పాటు వల్ల వరదల ఉత్పాతాన్ని నిరోధించవచ్చని తెలిపారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు గడ్కరి లేఖ రాశారు. వరద నీటిని రీవర్ బేసిన్ నుంచి కరవు పీడిత ప్రాంతాలకు మళ్లించడం ఈ పవర్ గ్రిడ్ ఉద్దేశమని గడ్కరి పేర్కొన్నారు.  వరదలు కారణంగా ఏటా రాష్ట్రానికి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. సమస్య తీవ్రతను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. వరదల వల్ల వివిధ ప్రాంతాల్లో సమస్యలు ఇబ్బడి ముబ్బడి అవుతున్నాయిని గుర్తు చేశారు.
 
ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అత్యవసరంగా ఒక ప్లాన్ రూపొందించాల్సి ఉంటుందని సీఎంకు గడ్కరి ఆ లేఖలో సూచించారు. నీటి కొరత, వర్షపాతం కొరత ఉన్న ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాల పెంపు, రైతు ఆత్మహత్యలు తగ్గడానికి గ్రిడ్ దోహదపడుతుందని చెప్పారు. 
 
వరద సంక్షోభ నివారణకు ఇది మేలైన మార్గమని సూచించారు. ప్రాజెక్టు చేపట్టడం వల్ల చేపలు వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా పెరుగుతాయని, కీలక ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని పేర్కొన్నారు . 
 
జాతీయ రహదారుల అభివృద్ధి అనేది తన శాఖ అయినప్పటికీ, నీటి పరిరక్షణ పట్ల తనకు ఆసక్తి మెండని, ఇందువల్ల రాష్ట్రంతో పాటు దేశ ముఖచిత్రంలో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని గడ్కరి ఆ లేఖలో తెలిపారు. 
జాతీయ రహదారుల నిర్మాణం, నీటి పరిరక్షణ ఏకకాలంలో జరిగితే నీటి నిల్వల సామర్థ్యం పెరగడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు దోహదకారి అవుతుందని ఆయన పేర్కొన్నారు.