న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా రెండోసారి విజయం  

న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్ రెండోసారి ఘన విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిర్వహించడంలో ఆమె చూపిన చొరవకు ఈ ఘన విజయం తార్కాణంగా నిలిచింది. 
 
శనివారం జరిగిన పోలింగ్‌లో 1.9 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకోగా  50 శాతం ఓట్లతో బంపర్‌ మెజార్టీ సాధించి జెసిండా చరిత్ర సృష్టించారు. ప్రస్తుత ఎన్నికల విధానాన్ని మొదలుపెట్టిన 1996 నుంచి ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
 
జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని సెంటర్-లెఫ్ట్ లేబర్ పార్టీ 50 శాతం ఓట్లతో 65 స్థానాలను గెలుచుకుంది. నేషనల్ పార్టీ కేవలం 27 శాతం ఓట్లతో 35 స్థానాల్లో విజయం సాధించారు. 2002 నుండి నేషనల్‌ పార్టీకి ఇదే చెత్త ఫలితం.  జిలాండ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పోటీ ఇద్దరు మహిళల మధ్యే జరిగింది. 
 
61 ఏళ్ల జుడిత్ కాలిన్స్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ (40) ను సవాలు చేశారు. లేబర్ పార్టీకి చెందిన జెసిందా 2017 లో ప్రధాని అయ్యారు. జెసిండా నేతృత్వంలోని న్యూజిలాండ్కొవిడ్-19 ను నియంత్రించడంలో గణనీయమైన విజయాన్ని సాధించింది. గురువారం నాటికి ఇక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.
 
ఆక్లాండ్‌లో మద్దతుదారులతో జెసిండా ఆర్డర్న్‌ మాట్లాడుతూ “రాబోయే మూడేండ్లలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కొవిడ్ సంక్షోభం నుంచి ప్రజలు క్షేమంగా బయటపడ్డారు. దేశ పునరుద్ధరణను మరింత వేగవంతం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు” అని చెప్పారు.
 
న్యూజీలాండ్‌లో ఐదు ప్రధాన పార్టీలు.. లేబర్ పార్టీ, నేషనల్ పార్టీ, న్యూజిలాండ్ ఫస్ట్, గ్రీన్ పార్టీ, యాక్ట్‌ న్యూజిలాండ్ ఉన్నాయి. 18 ఏండ్ల వయసు నిండిన న్యూజిలాండ్ పౌరులు ఓటు వేయవచ్చు. ఓటింగ్ తప్పనిసరి కాదు. ఓటు హక్కు ఉన్న ఎవరైనా ఎన్నికల్లో కూడా పోటీ చేయవచ్చు. 
 
న్యూజిలాండ్‌లో రాచరికం ఉన్నది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ రాణి దేశ అత్యున్నత పాలకురాలు. రాష్ట్ర అధిపతి. గవర్నర్ జనరల్ తన ప్రతినిధిగా ఇక్కడ ఉంటారు. రాణికి లేదా గవర్నర్ జనరల్‌కు రాజకీయాలతో సంబంధం ఉండదు. వీరు అధికారిక రాష్ట్ర వేడుకల్లో మాత్రమే కనిపిస్తారు. ఇక్కడ వ్రాతపూర్వక రాజ్యాంగం లేదు. 
 
మొత్తం 120 పార్లమెంటరీ స్థానాలు ఉండగా.. మెజార్టీకి 61 స్థానాల్లో గెలుపు అవసరం. 1996 లో అమలు చేసిన ఎమ్‌ఎమ్‌పీ విధానం ప్రకారం ఏ పార్టీకి 50 శాతం ఓట్లు లేదా 61 సీట్లు లభించలేదు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ కూటమి వ్రాతపూర్వకంగా మద్దతు పాయింట్లను సూచించాలి. పార్టీలు వెనక్కి తగ్గవు. అందువల్ల, పొత్తులు విచ్ఛిన్నం కావు.
 
కొవిడ్-19 ను నియంత్రించడంలో జెసిండా అర్డెర్న్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. అయితే, దేశంలో ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. చౌకైన గృహాలను అందిస్తామని హామీ ఇచ్చి పూర్తి చేయలేకపోయారు. 
 
జెసిండా ఆర్డెర్న్‌ 17 ఏండ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. 2008 లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. 37 సంవత్సరాల వయసులో ప్రధాని అయ్యారు.  షెడ్యూల్ ప్రకారం న్యూజిలాండ్‌లో సెప్టెంబర్ 19న ఎన్నికలు జరగాలి. అయితే కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించడంతో అక్టోబర్ 17కు ఎన్నికలు వాయిదా పడ్డాయి.