బ్యాంకాక్ ఎమర్జెన్సీ బేఖాతరు… ఉవ్వెత్తున నిరసనలు 

బ్యాంకాక్ ఎమర్జెన్సీ బేఖాతరు… ఉవ్వెత్తున నిరసనలు 
థాయిలాండ్‌లోని నిరంకుశ ప్రయూత్‌ చాన్‌ ఒచా ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీని బేఖాతరు చేస్తూ వరుసగా రెండో రోజు కూడా వేలాదిమంది ప్రజాస్వామ్య అనుకూలవాదులు బ్యాంకాక్‌ వీధుల్లోకి వచ్చి తమ తీవ్ర నిరసన తెలిపారు. శాంతియుతంగానే వారందరూ నినాదాలు చేసుకుంటూ ప్రదర్శన నిర్వహించారు.
 
అంతకంతకూ పెరుగుతున్న విద్యార్థుల నిరసనలను అణచివేయాలని ప్రధానిగా మారిన సైన్యాధిపతి చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. వార్తా పత్రికలపై సెన్సార్‌ పెట్టినా, ప్రజాతంత్ర హక్కులను హరించినా, ఎమర్జెన్సీ పేరుతో నిర్బంధాన్ని తీవ్రతంర చేసినా విద్యార్థులు, యువకులు లెక్కచేయలేదు. 
 
ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించి, తిరిగిస్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరిపేంతవరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. ఇంతకాలం ప్రయాత్‌ ఒచా తన ఉక్కు పిడికిలితో ప్రజల అసమ్మతిని అణచివేస్తూ వచ్చారు. 
 
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలం కావడం, అప్పటికే ఉన్న ఆర్థిక సంక్షోభం మరింత తీవ్ర రూపం డాల్చడం, నిరుద్యోగం ఉగ్ర రూపం దాల్చడంతో ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 
 
ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే తప్ప తమకు నిష్కృతి లేదని భావించారు. అందుకే మూకుమ్మడిగా తిరుగుబాటు చేశారు. బ్యాంకాక్‌లోని రేచ్‌ప్రసాంగ్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద వారు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. 
 
చాలా వారాల తర్వాత థాయిలాండ్‌ రాజు జర్మనీ నుండి తిరిగి రావడంతో వారు తమ డిమాండ్ల సాధనకు ఉద్యమం చేపట్టారు. థాయిలాండ్‌ రాజరికాన్ని విద్యార్ధులు సవాలు చేస్తున్నారు.