కేర‌ళ గోల్డ్ స్కామ్ లో దావూద్ ఇబ్ర‌హీం! 

కేరళ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్న కేరళ గోల్డ్‌ స్కామ్ కేసులో మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది దావూద్ ఇబ్ర‌హీం హ‌స్తం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  కేసును విచారిస్తున్న నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ అధికారులు బుధ‌వారం కోర్టుకు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.
బంగారం స్మ‌గ్లింగ్‌తో వ‌చ్చిన డ‌బ్బును జాతి వ్య‌తిరేక ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు వాడిన‌ట్లు ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు.  దౌత్య‌ప‌ర‌మైన మార్గంలో విదేశాల నుంచి బంగారం స్మ‌గ్లింగ్ చేస్తున్న కేసులో నిందితులుకు బెయిల్ ఇవ్వ‌రాదని కోర్టును ఎన్ఐఏ కోరింది.
దౌత్య‌ప‌ర‌మైన సంబంధాల గురించి మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేప‌ట్టాల్సి ఉంద‌ని ప్ర‌త్యేక కోర్టుతో ఎన్ఐఏ చెప్పింది.  గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో ఓ నిందితుడైన  రామీస్‌కు టాంజానియాలో డైమండ్ వ్యాపారం ఉన్న‌ది.  అత‌ను యూఏఈకి బంగారం అమ్మిన‌ట్లు తేలింది.
అయితే ఆఫ్రికాలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ జ‌రుపుతున్న నేరాల‌కు సంబంధించిన అంశాల‌ను ఎన్ఐఏ కోర్టుకు స‌మ‌ర్పించింది.  యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్ సాంక్ష‌న్స్ క‌మిటీ, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజ‌రీ ఇచ్చిన నివేదిక‌ల‌ను ఎన్ఐఏ త‌న వాద‌న‌లో వినిపించింది.
తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కాన్సులేట్‌కు చెందిన పార్శిల్‌లో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్‌లో భారీగా బంగారం పట్టుబడటంతో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు.
ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్‌ను అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. సీఎం విజ‌య‌న్‌కు కార్య‌ద‌ర్శిగా చేస్తున్న ఎం.శివ‌శంక‌ర్ హ‌స్తం కూడా ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే ఆయ‌న్ను ప‌దవి నుంచి సీఎం తొల‌గించారు.