ఏపీ హోంమంత్రి ఎస్సీ హోదా దుర్వినియోగం ఫిర్యాదుపై రాష్ట్రపతి భవన్ స్పందన

ఏపీ హోంమంత్రి ఎస్సీ హోదా దుర్వినియోగం ఫిర్యాదుపై రాష్ట్రపతి భవన్ స్పందన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎస్సీ హోదాను దుర్వినియోగం చేశారంటూ అందిన ఫిర్యాదుపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి సూచిందింది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత గత అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. అయితే ఇటీవల హోంమంత్రి ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో తాను క్రైస్తవురాలిని అని తెలియజేశారు. క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి ఎలా పోటీ చేస్తారు అంటూ లీగల్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థ రాష్ట్రపతికి ఈ అంశంపై ఫిర్యాదు చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే  రాష్ట్రపతి ఆర్డినెన్స్ (1950) ప్రకారం ఆ వ్యక్తి ఎస్సీ హోదా కోల్పోతారు. కాబట్టి క్రైస్తవ మతం స్వీకరించిన హోంమంత్రి సుచరిత ఎస్సీ హోదా వర్తించదని, ఆమె పత్తిపాడు నుంచి పోటీ చేసే అర్హత ఉండదని తెలుపుతూ.. ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తూ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో కోరింది. దీనిపై రాష్ట్రపతి భవన్ స్పందించడం, ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సూచించడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది.
అప్పుడు ఉండవల్లి శ్రీదేవి.. ఇప్పుడు మేకతోటి సుచరిత:
క్రైస్తవంలో ఉంటూ ఎస్సీ హోదా అనుభవిస్తూ ప్రజలను, ప్రభుత్వాలను తప్పుదోవపట్టిస్తున్న వ్యక్తులపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇదే విధంగా గతంలో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం వైసీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో కూడా రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడి నుండి వచ్చిన ఆదేశాల ఆధారంగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక ప్రత్యేక కమిటీ ఉండవల్లి శ్రీదేవిని విచారించింది. ఈ వ్యవహారంలో విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు, త్వరలోనే విచారణ తాలూకు రిపోర్ట్ సంబంధిత శాఖకు సమర్పించే అవకాశం ఉందని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ప్రతినిధులు తెలిపారు.
ఎస్సీలకు ఉద్దేశించిన స్థానాలు క్రైస్తవులకా? 
హిందూ మతంలో భాగంగా ఉండే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి ఉద్దేశించిన రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు, మతం మారిన క్రైస్తవులు అనుభవిస్తుండటం, అసలైన ఎస్సీలకు జరుగుతున్న అన్యాయంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజక వర్గాల్లో క్రైస్తవులను పోటీకి నిలబెట్టడం, వారికి కేటాయించిన పదవులను క్రైస్తవులకు ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారిని రాజకీయంగా అణచివేయడం, వారిని క్రైస్తవ మతంలోకి మార్చడం వంటి కుట్రలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. ఈ అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని తెలియజేసింది.

Source: VSK Telangana