చైనా వాఖ్యలకు భారత్ ఆగ్రహం 

లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మా దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి చైనాకు లోకస్ స్టాండి లేదని స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్, లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగంగా ఉంటాయని భారత్ నొక్కి చెప్పింది.

సరిహద్దులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరుస కొత్త వంతెనలను ప్రారంభించిన తరువాత సోమవారం చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి భారతదేశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌తోపాటు చట్టవిరుద్ధంగా ఏర్పాటుచేసిన లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాన్ని చైనా గుర్తించడంలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ ప్రకటించారు. 

ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తీవ్రంగా స్పందించారు. జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర భూభాగాలు భారతదేశంలో అంతర్భాగంగానే ఉన్నాయని స్పష్టం చేశారు . అరుణాచల్‌ప్రదేశ్ కూడా మా దేశంలో అంతర్భాగమే అన్న వాస్తవం అత్యున్నత స్థాయితో పాటు అనేక సందర్భాల్లో చైనాకు స్పష్టంగా తెలియజేశాం అని ఆయన గుర్తు చేశారు. 

నిజానికి భారతదేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి చైనాకు లోకస్ స్టాండి ( చర్యతీసుకునేందుకు హక్కు) లేదని పేర్కొన్నారు. భారతదేశం యొక్క అంతర్గత విషయాలపై దేశాలు ఇతరుల నుంచి ఆశించినంతగా వ్యాఖ్యానించవని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. 

సరిహద్దులో పెరుగుతున్న మౌలిక సదుపాయాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై కూడా అనురాగ్‌ శ్రీవాస్తవ  అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల జీవనోపాధి, ఆర్థిక సంక్షేమాన్ని మెరుగుపరచడానికి మౌలిక సదుపాయాలను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు.

 సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి, భారతదేశ భద్రత, వ్యూహాత్మక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని తెలిపారు.