
నవరాత్రి సందర్భంగా అయోధ్యలో నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తొమ్మిదో రోజు మెగా కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నారు. ఈ రామ్‌లీలాలో బాలీవుడ్ నటులు రామాయణంలోని పాత్రలుగా నటించనున్నారు.
పశ్చిమ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపి ప్రవేష్ సాహిబ్ సింగ్ వర్మ, బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్ సీఎం ఆదిత్యనాథ్‌ను కలుసుకుని రామ్‌లీలాకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. వీరి ఆహ్వానాన్ని అంగీకరించిన ముఖ్యమంత్రి రామ్‌లీలాకు తప్పక హాజరవుతానని హామీ ఇచ్చారు.
ఈ ఏడాది అయోధ్య పట్టణంలో ‘అయోధ్య కి రామ్‌లీలా’ ప్రధాన కార్యక్రమం కానున్నది. ఈ ఉత్సవాలు అక్టోబర్ 17 న ప్రారంభమై అక్టోబర్ 25 న దసరాతో ముగుస్తాయి. మెగా షో సరయు నది ఒడ్డున ఉన్న లక్ష్మణ్ క్విలాలో ప్రదర్శించనున్నారు.
రామనంద్ సాగర్ నిర్మించిన టీవీ సీరియల్ ‘రామాయణం’లో హనుమంతుడి పాత్రను పోషించిన దివంగత నటుడు దారాసింగ్ కుమారుడు విందు దారాసింగ్ తన తండ్రి అడుగుజాడల్లో నడిచి ఈ రామ్‌లీలాలో హనుమంతుడి పాత్రను పోషించనున్నారు.
ఈశాన్య ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపిగా ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు మనోజ్ తివారీ, కిష్కింధ రాజ్యానికి చెందిన పురాణ రాజు బాలి కుమారుడు అంగద్ పాత్రలో నటించనున్నారు.
ప్రఖ్యాత భోజ్‌పురి నటుడు, గోరఖ్‌పూర్ ఎంపీ రవికిషన్ భారతుడిగా.. సీత పాత్రను కవితా జోషి, రాముడిగా సోను సాగర్ పోషిస్తారు. బాలీవుడ్ హాస్యనటుడు అస్రానీ నారద మునిగా నటించనున్నారు. రామ్‌లీలాలో కనిపించే ఇతర బాలీవుడ్ నటులు రాజా మురాద్, షాబాజ్ ఖాన్, అవతార్ గిల్, రాజేష్ పూరి, రాకేశ్ బేడిలు కూడా కార్యక్రమంలో పాలుపంచుకొంటారు.
అయితే, కొవిడ్ -19 ప్రోటోకాల్ కారణంగా ఈ కార్యక్రమానికి ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈ కార్యక్రమం వార్తా ఛానెల్స్, సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
More Stories
మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు, డిజిపిపై వేటు
పార్లమెంట్ భవనం ప్రారంభం బహిష్కరించి దేశాన్ని అవమానించారు
మయన్మార్ నుండి వివిధ తెగల వలసలపై అమిత్ షా దృష్టి