రాష్ట్రాల కోసం కేంద్రం రూ.1.1 లక్ష కోట్ల అప్పు 

రాష్ట్రాల కోసం కేంద్రం రూ.1.1 లక్ష కోట్ల అప్పు 

ఆర్థిక, ఆరోగ్య రంగాలను తీవ్రంగా దెబ్బతీసిన కరోనా మహమ్మారి కలకలం కారణంగా పెద్ద పెద్ద సంస్థలతోపాటు ప్రభుత్వాలు కూడా అప్పులు చేయక తప్పడం లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1.1 లక్ష కోట్లు అప్పు చేయాలని నిర్ణయించింది. 

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ళలో తగ్గుదల వల్ల ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాల తరపున అప్పు చేయబోతోంది. 2017 జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి రావడంతో స్థానిక పన్నులు, వ్యాట్ వంటి పన్నులను విధించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వదులుకున్నాయి.

ఈ అధికారాన్ని వదులుకోవడం వల్ల రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అంగీకరించింది. తాజాగా జీఎస్‌టీ వసూళ్ళలో తగ్గుదల వల్ల రాష్ట్రాల బడ్జెట్లు తలక్రిందులవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో గత ఆర్థిక సంవత్సరం నుంచి మందగమనం కనిపిస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన వివరాల ప్రకారం, అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1.1 లక్షల కోట్లు జీఎస్‌టీ తగ్గినట్లు అంచనా.  జీఎస్‌టీ తగ్గుదలను భర్తీ చేయడం కోసం ప్రస్తుత పరిమితులకు మించి రూ.1.1 లక్షల కోట్లను అప్పు తెచ్చుకోవడానికి రాష్ట్రాలకు స్పెషల్ విండో సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. 

ప్రస్తుతం ఈ సొమ్మును భారత ప్రభుత్వమే అప్పుగా సేకరించాలని నిర్ణయించింది. ఈ విధంగా తీసుకొచ్చిన అప్పును జీఎస్‌టీ నష్టపరిహారం సుంకం విడుదలకు బదులుగా బ్యాక్-టు-బ్యాక్ రుణంగా రాష్ట్రాలకు అందజేస్తుంది. అయితే వడ్డీ, అసలు చెల్లింపులు చేసేది ఎవరో ఈ ప్రకటనలో తెలియజేయలేదు. ఈ అప్పు ప్రభావం భారత ప్రభుత్వ ఆర్థిక లోటుపై ఉండబోదని తెలిపింది.