ఇటీవల కరోనా బారిన పడి కోలుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం నుండి బహిరంగ ఎన్నికల ప్రచారంలో పాల్గంటారని వైట్‌హౌస్ వైద్యులు ప్రకటించగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన్నట్లు రాజకీయ ప్రత్యర్ధులు ఆయనపై ఇప్పటికే విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
అయితే మరో మూడు వారాలలో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ మాత్రం చైనాను, కమ్యూనిస్టులను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ లేదా నిరంకుశ పార్టీల్లో కానీ, వాటికి అనుబంధంగా ఉన్న సంస్థల్లో కానీ సభ్యులుగా ఉంటే వారికి అనుమతి నిరాకరించాలంటూ అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) ఇటీవల జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అమెరికన్లలో చైనా వ్యతిరేకతను, కమ్యూనిస్టు వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రయోజనాలను కాపాడే గొప్ప రక్షకుణ్ణి తానే అని స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విదేశీయులు, ముఖ్యంగా చైనా, కమ్యూనిస్టులు దేశ ప్రయాజనాలకు ప్రమాదకరంగా మారిన్నట్లు హెచ్చరిస్తున్నారు.
అమెరికా రక్షణ, జాతీయ భద్రతలకు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు లేదా ఆ నేపథ్యం ఉన్నవారిని ప్రధాన ప్రమాదకరంగా చూపుతూ దేశంలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి దీనిని వర్తింపజేయాలని యుఎస్‌సిఐఎస్ మార్గదర్శ కాలు చెబుతున్నాయి.
ఏదైనా మినహాయింపు ఇస్తే తప్ప అమెరికాలో ఉంటున్న, లేదా బయట దేశాలనుంచి వచ్చే కమ్యూనిస్టు పార్టీ సభ్యులకు ఎవరికీ సాధారణంగా అనుమతి ఇవ్వరాదని అది సర్కులర్ జారీ చేశారు. అయితే మేధావులు, ప్రధాన రాజకీయ పక్షాలలో చొరబడే కమ్యూనిస్టులను గుర్తించడం అమెరికాకు సాధ్యమా అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతుంది.
అమెరికాలోని అతిపెద్ద విదేశీ విద్యార్థుల బృందం చైనాదే కావడంతో వారిని కట్టడి చేస్తే తాము పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవలసి వస్తుందని అమెరికాలోని విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పైగా పర్యాటక రంగంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఇలా ఉండగా, డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారిస్ ఓ కమ్యూనిస్టు అని, సెనేటర్ బెర్నీ శాండర్స్‌కు ఎడమ భుజం వంటి వారని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఆరోపించారు. తన ప్రత్యర్థి జో బిడెన్‌ను అధికారంలోకి వస్తే రెండు నెలలు కూడా అధ్యక్ష పదవిని చేపట్టలేరని అంటూ దొంగచాటుగా అధికారమలోకి రావడానికి కమ్యూనిస్టులు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ గెలిచినట్లయితే.. ఒక్క నెలలోపే ఆ అధికారాన్ని ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారిస్ లాగేసుకుంటారని కూడా హెచ్చరించారు. ఆమె కమ్యూనిస్టని, సోషలిస్టు కాదని, ఆమె అభిప్రాయాలను చూస్తే.. దేశంలోకి హంతకులు, రేపిస్టులు వచ్చేందుకు సరిహద్దులు తెరవాలని కోరుకుంటున్నారంటూ విమర్శించారు.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’