బీజేపీ నేతలపై కోల్‌కతా పోలీసులు కేసు   

చట్టాన్ని ఉల్లంఘించడం, చట్టవ్యతిరేకంగా సమావేశం కావడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, ఎంపీలు లాకెట్ ఛటర్జీ, అర్జున్ సింగ్, రాకేష్ సింగ్ సహా పలువురు బీజేపీ నేతలపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఎస్‌ఎస్‌సీ/టీఈటీ పరీక్షల్లో అవినీతి, రాష్ట్రంలో నిరుద్యోగంపై భారతీయ జనతా పార్టీ యువ మోర్చా (బీజేవైఎం) పశ్చిమబెంగాల్ విభాగం గురువారంనాడు ఛలో సచివాలయం నిర్వహించింది. వివిధ పరీక్షలకు గరిష్ట వయోపరిమితి పెంచాలని, పీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సరళతరం చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
బీజేవైఎం కొత్త అధ్యక్షుడు, ఎంపీ, తేజస్వి సూర్య సారథ్యంలో హౌరా నుంచి ఈ ప్రదర్శన నిర్వహించారు. కాగా, బీజేపీ నేతలు చట్ట విరుద్ధంగా సమావేశం కావడంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించారంటూ కోల్‌కతా పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 143, 147, 149, 332, 353, 283 కింద ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.
మరోవైపు, ర్యాలీపై నాటుబాంబుతో దాడి జరిగిందని, ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వెళ్లిన ఎంపీలపై జరసంకో పోలీస్ స్టేషన్‌ అధికారులు చేయి చేసుకున్నారని సూర్య ఆరోపించారు. కాగా, శానిటేషన్ పేరుతో రాష్ట్ర సచివాయాలన్ని గురువారం నుంచి రెండు రోజులు మూసేశారు.
దీనిపై సూర్య ఓ ట్వీట్ చేస్తూ ‘ఈ పోరాటంలో బీజేపీ గెలిచినందుకు సంతోషంగా ఉంది. యుద్ధంలో కూడా మేమే గెలుస్తాం. నబన్నో-సీఎంఓను ప్రక్షాళన చేసే కార్యక్రమం మేము చాలాకాలంగా చేపట్టాం. అనుకోకుండా మమత కూడా అదే చేశారు. 2021లో ప్రక్షాళన కార్యక్రమం మేము పూర్తి చేస్తాం. బెంగాల్‌కు థాంక్స్. మేము తిరిగి వస్తాం. బెంగాల్ ప్రతిష్టను పునరుద్ధరిస్తాం’ అని పేర్కొన్నారు.
మమతా బెనర్జీ ప్రజా విశ్వాసం కోల్పోయారని చెప్పడానికి సచివాలయం మూతవేయడమే నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. మమత అధికార దుర్వినియోగం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజల వెంట తాము ఉన్నామని, సచివాలయం మూతపడేలా చేయడంలో బీజేవైఎం కార్యకర్తలు సఫలమయ్యారని ఓ ట్వీట్ లో నడ్డా కొనియాడారు.