రుద్రం1 క్షిపణి ప్రయోగం విజయవంతం  

భారత్‌ను కవ్వించే శత్రు దేశాల రాడార్లు, ట్రాకింగ్, కమ్యూనికేషన్ల వ్యవస్థలను దెబ్బతీసే యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం 1 ప్రయోగం విజయవంతం అయింది. ఒడిషాలోని బాలాసోర్ సమీకృత ప్రయోగ స్థావరం (ఐటిఆర్) నుంచి శుక్రవారం ఉదయం పదిన్నర ప్రాంతంలో పరీక్షించినట్లు రక్షణ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. 

ప్రత్యర్థుల అణుధార్మిక ఆయుధాల ధాటిని తిప్పికొట్టేందుకు రుద్రం అన్ని విధాలుగా మన వాయుసేనకు ఉపయోగపడుతుంది. చైనాతో సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం ఎయిర్‌ఫోర్స్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు అత్యంత కీలక క్షిపణి ప్రయోగాలకు దిగుతోంది. వాయుసేనకు అధునాతన వ్యూహాత్మక ఆయుధ సంపత్తిని సమకూర్చడమే లక్షంగా పరీక్ష జరిగినట్లు తెలిపారు. 

రుద్రం 1 క్షిపణి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన యాంటీ రేడియేషన్ మిస్సైల్. ఇది శబ్ధవేగాన్ని మించి రెండింతల స్థాయిలో దూసుకుపోతుంది. గణాంకాలలో చూస్తే దీని వేగపు సత్తా మాక్ టూ. ఐటిఆర్‌లోని సుఖోయ్ 30 యుద్ధ విమానం నుంచి ఈ యాంటీ రేడియేషన్ మిస్సైల్‌ను ప్రయోగించి చూశారు.

వాయుసేనకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానాల అస్త్రంగా ఉండే రుద్రం అన్ని విధాలుగా నిర్ణీత లక్షాలను ఛేదించింది. ప్రయోగ విజయ సంకేతాలు సమగ్రంగా రికార్డు అయ్యాయని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. వాయుసేనలోకి ఈ అస్త్రశస్త్ర క్షిపణి వచ్చి చేరితే అవి మన సుఖోయ్ యుద్ధవిమానాలకు మరింత పదును పెట్టేగా అమరుతాయి. 

దేశానికి చెందిన రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) జరిపిన ఈ పరీక్ష విజయవంతం అయిన వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఆర్‌డిఒ టీంను అభినందించారు. రక్షణ విషయాలలో వ్యూహాత్మక దిశలో మరింత ముందుకు దూసుకువెళ్లే క్రమంలో ఇటువంటి పరీక్షలు విజయవంతం కావడం కీలక పరిణామమని పేర్కొన్నారు. 

భవిష్యత్త్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దిన ఈ నవతరపు యాంటి రేడియేషన్ మిస్సైల్ తయారీలో పాలుపంచుకున్న డిఆర్‌డిఒ శాస్త్రజ్ఞులు, సాంకేతిక సిబ్బందికి అభినందనలు అని రక్షణ మంత్రి ట్వీట్ వెలువరించారు.

చైనా దూకుడును గుర్తించిన భారత్ ఇటీవలి కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలకు దిగుతోంది. ఇప్పటివరకూ నాలుగు అత్యంత అధునాతన క్షిపణి సామర్థాలను పరీక్షించారు. వాయుసేనను చైనా కన్నా పైచేయిగా ఉంచేందుకు మన దేశం సర్వం సన్నద్ధం అయింది. ఓ వైపు ఈ ప్రయోగాలు, మరో వైపు నిర్భయ మిస్సైల్‌ను భారత్ చైనా సరిహద్దులకు తరలించడం పూర్తి అయింది. 

700 కిలోమీటర్ల లక్షాన్ని ఛేదించే శౌర్య క్షిపణులను కూడా రంగంలోకి దింపనున్నారు. ఇటవలే స్మార్ట్ టార్పిడో క్షిపణిని పరీక్షించారు. హైపర్ సోనిక్ టెక్నాలజీ అనుసంధాన వాహనం (హెచ్‌ఎస్‌టిడివి)ని కూడా ప్రయోగించారు. దీనితో సుదూరంలోని లక్షాలను ఛేదించే శక్తివంతమైన క్రూజ్‌మిస్సైల్స్, హైపర్ సోనిక్ క్షిపణులను అత్యంత వేగవంతంగా తీసుకువెళ్లగల్గుతుంది.