ఐఎస్ఐకి `హాల్’ ఉద్యోగి యుద్ధ విమానాల స‌మాచారం

పాకిస్తాన్‌కు చెందిన ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్ఐ) ఏజెన్సీకి యుద్ధ విమానాల ర‌హ‌స్య స‌మాచారాన్ని చేర‌వేసినందుకుగాను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్‌) ఉద్యోగిని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) నేడు అరెస్టు చేసింది. 

విశ్వ‌స‌నీయ స‌మాచారంపై ఏటీఎస్ నాసిక్ యూనిట్ రైడ్ చేసి వ్య‌క్తిని అరెస్టు చేసింది. నిందితుడిని దీప‌క్ షిర్సాత్(41)‌గా గుర్తించారు. వ్యక్తి భారతీయ యుద్ధ విమానాలు, వాటి తయారీ యూనిట్ గురించి రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ గూఢాచార సంస్థ‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నాడు. వాట్సాప్, సోషల్ మీడియా వేదిక‌ల ద్వారా స‌మాచారాన్ని చేర‌వేస్తున్న‌ట్లు డీసీపీ వినయ్ రాథోడ్ తెలిపారు.

నాసిక్ సమీపంలోని ఓజార్ వద్ద ఉన్న హెచ్ఏఎల్ విమానాల తయారీ యూనిట్, ఎయిర్ బేస్ అదేవిధంగా తయారీ యూనిట్ లోపల నిషేధిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారం కూడా దీప‌క్ పంచుకున్నట్లు చెప్పారు. 

అసిస్టెంట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న దీప‌క్‌పై అధికార ర‌హస్యాల చట్టం కింద నేరం న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. వ్య‌క్తి వ‌ద్ద నుండి మూడు మొబైల్ హ్యాండ్‌సెట్‌లతో పాటు ఐదు సిమ్ కార్డులు, రెండు మెమరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఓజార్ యూనిట్ మిగ్ సిరీస్ విమానాల త‌యారీతో పాటు సు -30 ఎంకేఐ విమానాల మరమ్మతు చేప‌డుతుంది.