సీబీఐ కేసు నమోదు వెనుక జగన్!

వ్యాపారం కోసం రుణం తీసుకొని రూ.826.17 కోట్లు దారి మళ్లించానంటూ తనపై దాడులు జరిపి, సిబిఐ కేసు నమోదు చేయడం వెనుక ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు నరసాపురం ఎంపీ కె రఘురామకృష్ణం రాజు తీవ్రమైన ఆరోపణ చేశారు. 
 
కేంద్ర ఆర్ధిక శాఖలో ఉన్న తన బ్యాచ్‌మేట్‌ ద్వారా సిఎం కార్యాలయ ఉన్నతాధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తనపై కేసు వేయించేలా చేశారని కూడా ఆరోపించారు. తనను ఎంపి పదవికి అనర్హుడిగా ప్రకటించలేకే వైసిపి నేతలు దిగుజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
 
వ్యాపారం కోసం రుణం తీసుకొని రూ.826.17 కోట్లు దారి మళ్లించానంటూ రఘురామకు సంబంధించిన ఇండ్‌-భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ సంస్థతో పాటు దాని డైరెక్టర్లు, అధికారులపై సిబిఐ ఢిల్లీ విభాగం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే బ్యాంకుల ద్వారా తనకు మంజూరైన మొత్తం రుణం రూ.4 వేల కోట్లలోపేనని, అందులో రూ. 2 వేల కోట్లు బ్యాంకు నుంచి ఇప్పటికీ డ్రా చేయలేదని తెలిపారు.  తనపై కేసు నమోదైన 6వ తేదీనే ప్రధాని నరేంద్ర మోదీని సిఎం జగన్‌ కలిశారని గుర్తు చేశారు.
పైగా, అదే రోజు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ జగన్‌ను ఢిల్లీలో కలవడం అనుమానాస్పదంగా ఉందని రఘురామరాజు పేర్కొన్నారు. వారిపై రూ.43 వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నందునే తనపై రూ.23 వేల కోట్లకు ఆరోపణలు చేశారని భావిస్తున్నానని తెలిపారు.
తప్పుడు కథనాలు రాసిన వారిపై పరువు నష్టం దావా వేయాలని తమ న్యాయవాదులు సూచిస్తున్నారని, మూడు, నాలుగు నెలల్లో జైలుకు వెళ్లే వారిపై మరో కేసు వేయడం ఎందుకని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. కాగా, తన వ్యాపార లావాదేవీల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని, సిబిఐ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని చెప్పారు.