సుస్థిర, శాంతియుత ఆఫ్ఘన్‌కు భారత్ మద్దతు

ఆఫ్ఘనిస్థాన్ సుస్థిరంగా, శాంతి, సౌభాగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు భారత్ పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్, తాలిబన్ల మధ్య దోహాలో శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భరోసా ఇచ్చింది.

ఆఫ్ఘనిస్థాన్ శాంతి చర్చల ప్రతినిథి డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా, భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్  శుక్రవారం సమావేశమై ఆఫ్ఘనిస్థాన్, తాలిబన్ల మధ్య జరుగుతున్న చర్చలు, ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించారు. జైశంకర్ ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలను వెల్లడించారు. 

హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకన్సిలియేషన్ (హెచ్‌సీఎన్ఆర్) చైర్మన్ డాక్టర్ అబ్దుల్లాతో సమావేశమవడం సంతోషంగా ఉందని తెలిపారు. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ సమస్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు. 

ఇటీవలి పరిణామాలపై ఆయన దృక్పథాన్ని, భావాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలకు ఓ పొరుగు దేశంగా భారత దేశం కట్టుబడి ఉందని జైశంకర్ స్పష్టం చేశారు.

అబ్దుల్లా ఇచ్చిన ట్వీట్‌లో, ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు భారత దేశం సంపూర్ణంగా సహకరిస్తుందని జైశంకర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియపై అభిప్రాయాలను పంచుకున్నామని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు, శాంతి కోసం ప్రాంతీయ సహకారం గురించి చర్చించినట్లు తెలిపారు.

ఇదిలావుండగా, డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు భారత దేశం ఎల్లప్పుడూ మద్దతిస్తుందని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు శాంతి కోసం జరుపుతున్న అన్వేషణకు, వారి అభివృద్ధి ఆకాంక్షలకు గట్టి మద్దతిస్తుందని చెప్పారు. 

డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా ఈ నెల 6న భారత దేశ పర్యటనకు వచ్చారు. ఆయన భారత దేశంలో 5 రోజులపాటు పర్యటిస్తారు. ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియకు మద్దతు కూడగట్టడానికి, ప్రాంతీయ ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య దోహాలో శాంతి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.