సరిహద్దుల్లో 60 వేల మంది సైనలను మోహరించిన చైనా

భార‌త స‌రిహ‌ద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహ‌రించిన‌ట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో వెల్ల‌డించారు.  ఇటీవ‌ల భార‌త్‌, చైనా మ‌ధ్య ల‌డాఖ్‌లో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన విష‌యం తెలిసిందే.

చైనా వైఖ‌రిని ఖండించిన అమెరికా విదేశాంగ మంత్రి డ్రాగన్ దేశం త‌న చెడు ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌య‌ట‌పెట్టిన‌ట్లు ఆరోపించారు.  క్వాడ్ దేశాల‌కు చైనాతో ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.  జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో క్వాడ్ దేశాల ప్ర‌తినిధులు స‌మావేశం అయిన విష‌యం తెలిసిందే. 

క్వాడ్ గ్రూపులో అమెరికా, జ‌పాన్‌, ఇండియా, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. ఇండో ప‌సిఫిక్ స‌ముద్ర ప్రాంతంలో చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, భారత్‌లోని వాస్త‌వాధీన రేఖ వెంట కూడా చైనా తీరు స‌రిగా లేద‌ని పాంపియో విమ‌ర్శించారు.

శుక్ర‌వారం ఓ టీవీ షోలో పాల్గొన్న పాంపియో సుమారు 60 వేల మంది చైనా సైనికులు ఉత్త‌ర భార‌త స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌ట్లు చెప్పారు. టోక్యోలో జ‌రిగిన క్వాడ్ స‌మావేశంలో భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌తో పాంపియో భేటీ అయ్యారు. 

‘‘చైనాను చూసీచూడనట్లు వదిలేశామని క్వాద్ ప్రజలు భావిస్తున్నారు. మునుపటి ప్రభుత్వాలు కూడా దశాబ్దాల పాటు చైనా చేష్టలను చూస్తూ ఉండిపోయాయి. మన మేథో సంపత్తిని, ఉద్యోగాలను తీసుకెళ్తున్నా… చూసీ చూడనట్లు ఉండిపోయాయి. వారి వారి దేశాల్లో కూడా ఇలాగే జరిగినా మిన్నకుండిపోయాయి’’ అని పాంపీయో మండిపడ్డారు. 
 
భారత్‌కు వ్యతిరేకంగా చైనా అధిక సంఖ్యలో సైనికులను మోహరిస్తోందని, ఈ సమయంలో అమెరికా స్నేహం భారత్‌కు అత్యావశ్యకమని ఆయన పేర్కొన్నారు.   చైనాలోని క‌మ్యూనిస్టు పార్టీతో క్వాడ్ దేశాల‌కు ప్ర‌మాదం పొంచిన‌ట్లు పాంపియో హెచ్చరించారు.