విదేశీ వ్యాక్సిన్లకు నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి

 విదేశాల్లో తయారైన కరోనా వ్యాక్సిన్లు అక్కడి ట్రయల్స్‌లో అన్ని విధాలా సమర్థమైనవిగా నిరూపణ అయినప్పటికీ భారత ప్రజలకు సరిపడే విధంగా అవి నిరూపించుకోవలసి ఉందని, ఆయా వ్యాక్సిన్ల భద్రత, రోగనిరోధకతలను నిర్ధారించే బ్రిడ్జింగ్ అధ్యయనాలు సంతృప్తి కరంగా ఉంటేనే భారత్‌లో వాటికి అనుమతి లభిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. 
 
ఈమేరకు ఇక్కడ అదనపు నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి అని పేర్కొన్నారు. దీని కోసం చిన్నపాటి, త్వరగా పూర్తయ్యే నమూనా అధ్యయనాలను చేపడతామని వివరించారు. అంతర్జాతీయంగా అనేక సంస్థలు కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో చివరి ఘట్టంలో ఉన్న సమయంలో ఈ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. 
 
రష్యాకు చెందిన కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కి సంబంధించిన మూడో దశ ట్రయల్స్ భారత్‌లో చేపట్టే విషయమై ఇప్పటివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి ప్రకటించారు. భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ ట్రయల్స్ చేపట్టిన కొవాగ్జిడ్, జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్‌డి, వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి.  
 
కాగా, దేశంలో గడచిన 24 గంటలలో 10,89,403 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 61,267 పాజిటివ్ కేసులు,  884 మరణాలు నమోదయిన్నట్లు తెలుపుతూ మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,85,083గా ఉంది.
 
 దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,19,023గా ఉండగా.. కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 56,62,491కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 1,03,569 మంది మృతి చెందారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 84.70 శాతంగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 13.75గా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,10,71,797 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.