అన్‌లాక్5లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి విద్యా సంస్థలను తెరుచుకోవచ్చునని సూచించింది. అయితే, ఆయా రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చునని తెలిపింది.
విద్యార్థులు భౌతికంగా హాజరు కాకుండా ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం కావాలనుకుంటే వారి ఇష్టానికి వదిలివేయాల్సిందిగా కేంద్ర విద్యాశాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. ఆన్‌లైన్ క్లాసులను ప్రోత్సహించాలని సూచించింది. పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రుల సమ్మతితోనే హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశించింది.
పాఠశాలల్లో కోవిడ్19 నుంచి కాపాడుకునేలా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించింది. విద్యాలయాల్లోని మౌలిక వసతుల విషయంలో శుభ్రత పాటించాలని సూచించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంలాంటి నిబంధనలు కొనసాగించాలని తెలిపింది.
విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురైనపుడు వారు ఇంట్లోనే విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పిస్తూ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. పాఠశాలలు ప్రారంభించిన రెండు, మూడు వారాల వరకు మదింపు చేయొద్దని విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆదేశించారు.
స్కూళ్లు తెరిచిన రెండు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని స్పష్టం చేశారు. డాక్టర్, నర్సు, ఆరోగ్య సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూడాలి. అన్ని తరగతుల విద్యా క్యాలెండర్‌కు మార్పులు చేయాలని వివరించారు.
More Stories
జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరి హత్య
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభ్యం