చైనా వ్యూహానికి భారత్‌ తిరుగులేని ప్రతివ్యూహం  

హిందూ మహాసముద్రం, శ్రీలంకలో పాగా వేసి జలాంతర్గాములతో భారత్‌ను ఇబ్బందిపెట్టాలన్న చైనా వ్యూహానికి భారత్‌ తిరుగులేని ప్రతివ్యూహంతో సిద్ధమైంది. శత్రు జలాంతర్గాములను ధ్వంసం చేసే సూపర్‌సోనిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టార్పిడో(స్మార్ట్‌) ఆయుధ వ్యవస్థను సోమవారం డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. 
 
తద్వారా సమద్రంపై యుద్ధంలో ఆధిపత్యం కోసం భారత అమ్ముల పొదిలో కొత్త అస్త్రం చేరింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం ఐల్యాండ్‌లో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. 
 
‘యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధతంత్రంలో ఈ ప్రయోగం కీలకమైన మలుపు’ అని అభివర్ణించారు. విజయానికి కారణమైన డీఆర్డీవో, శాస్త్రవేత్తలను అభినందించారు. స్మార్ట్‌ వ్యవస్థ ఒక ‘గేమ్‌ చేంజర్‌’ అని డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి చెప్పారు. జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి భారత్‌ ఇప్పటికే టార్పిడోలను తయారు చేస్తున్నది.
 
వీటి సామర్థ్యం కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే. డీఆర్డీవో తయారుచేసిన ఈ స్మార్ట్‌ వ్యవస్థ రేంజి దాదాపు 650 కిలోమీటర్లు. క్షిపణులు, టార్పిడో.. ఈ రెండు వ్యవస్థలను కలిపి హైబ్రిడ్‌ వ్యవస్థ అయిన స్మార్ట్‌ను అభివృద్ధి చేశారు. 
 
దేశ సముద్రజలాల్లోకి చొచ్చుకువచ్చే జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి ఈ వ్యవస్థను వాడతారు.  స్మార్ట్‌ను యుద్ధనౌకలపై నుంచి లేదా సముద్రం ఒడ్డున ఉంచిన ట్రక్‌పై నుంచి ప్రయోగించవచ్చు. 
 
గత కొద్ది నెలలుగా భారత్‌ క్రమం తప్పకుండా దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణులను పరీక్షిస్తున్నది.    గత శనివారం శౌర్య క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గత బుధవారమే సూపర్‌ సోనిక్‌ బ్రహ్మోస్‌ క్షిపణిని కూడా పరీక్షించింది. 
 
గత నెల 23న ట్యాంకు విధ్వంసక లేజర్‌ గైడెడ్‌ క్షిపణిని డీఆర్డీవో పరీక్షించింది. ఒక రోజు తర్వాతే పృథ్వీ-2 క్షిపణిని కూడా పరీక్షించారు. అంతకుముందు జూలై 23న ట్యాంకు విధ్వంసక ధృవ క్షిపణిని పరీక్షించారు.