విధ్వంసాన్ని నివారించేందుకే అర్థ‌రాత్రి ద‌హ‌నం  

హ‌త్రాస్‌లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందిన ద‌ళిత యువ‌తిని అర్థ‌రాత్రి ద‌హ‌నం చేశారని యూపీ పోలీసుల‌పై చెలరేగుతున్న తీవ్ర విమ‌ర్శ‌లని ఆ రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారవేసింది. తెల్లారితే భారీ స్థాయిలో విధ్వంసం జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని, అందుకే రాత్రికి రాత్రే ఆ యువ‌తి మృత‌దేహానికి ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించిన‌ట్లు యూపీ ప్ర‌భుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ప్ర‌కారం తీవ్ర‌మైన శాంతిభ‌ద్ర‌తల స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం రావ‌డం వ‌ల్లే అర్థ‌రాత్రి ద‌హ‌నం చేసిన‌ట్లు యూపీ ప్రభుత్వం పేర్కొన్న‌ది.  అర్ధ‌రాత్రి 2.30 నిమిషాల‌కు ఎందుకు ద‌హ‌నం చేయాల్సి వ‌చ్చిందో కూడా త‌న అఫిడ‌విట్‌లో సుప్రీంకు యూపీ ప్రభుత్వం వివ‌రించింది.  బాబ్రీ మ‌సీదు తీర్పు నేప‌థ్యంలో జిల్లాలో హై అల‌ర్ట్ జారీ చేశార‌ని, ఆ నేప‌థ్యంలో అల్ల‌ర్లు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌న్న భావ‌నతో ద‌హ‌నం చేసిన‌ట్లు తెలిపారు.

స‌ఫ్దార్‌గంజ్ హాస్పిట‌ల్‌లో సెప్టెంబ‌ర్ 29వ తేదీన జ‌రిగిన ధ‌ర్నా గురించి ఇంటెలిజెన్స్ నివేదిక వ‌చ్చింద‌ని, ఆ ఘ‌ట‌న‌కు కులం రంగు పూసార‌ని, అయితే భారీ అల్ల‌ర్ల‌ను అద‌పు చేసేందుకు ద‌హ‌నం చేసిన‌ట్లు యూపీ ప్రభుత్వం సుప్రీంకు చెప్పింది. మ‌రోవైపు ఇవాళ యోగి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృంద. హ‌త్రాస్ క్రైమ్‌సీన్‌కు వెళ్లి స‌మాచారం సేక‌రిస్తున్న‌ది.

హ‌త్రాస్ కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాల‌ని యూపీ ప్రభుత్వంత‌న పిటిష‌న్‌లో సుప్రీంకోర్టును కోరింది.  సుప్రీం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సీబీఐ విచార‌ణ కొన‌సాగాల‌ని యూపీ ప్ర‌భుత్వం అభిప్రాయ‌ప‌డింది.  రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు విష‌ప్ర‌చారం నిర్వ‌హించార‌ని అఫిడ‌విట్‌లో యోగి ప్ర‌భుత్వం ఆరోపించింది. 
 
హ‌త్రాస్ ఘ‌ట‌న ప‌ట్ల ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణకు సంబంధించిన వివ‌రాల‌ను సుప్రీంకు స‌మ‌ర్పించారు.  అర్థ‌రాత్రి ద‌హ‌నం చేసేందుకు యువ‌తి త‌ల్లితండ్రుల‌ను జిల్లా అధికారులు ఒప్పించిన‌ట్లు  అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు.