డీపీఆర్‌ల సమర్పణకు ఇద్దరు సీఎంల అంగీకారం 

రెండు రాష్ట్రాల్లో తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు సమర్పించేందుకు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని  కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర  సింగ్‌ షెకావ‌త్  తెలిపారు. డీపీఆర్‌లు పరిశీలించి అపెక్స్‌ కౌన్సిల్ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
 
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఇవాళ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు, ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
 
రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జల వివాదంపై ఇరు రాష్ట్రాలు గట్టిగా వాదనలు వినిపించినట్లు తెలుస్తున్నది. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం గజేంద్రసింగ్ షెకావత్ మీడియా సమావేశంలో ఇరు రాష్ట్రాల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
 
తెలుగు రాష్ట్రాలు కొత్తగా నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టుల రిపోర్టులు సంబంధిత నదీ బోర్డులకు అందించాలని కేంద్ర మంత్రి సూచించారు. వారు పరిశీలించి అభిప్రాయాలు చెప్పిన తర్వాత అపెక్స్‌ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. 
 
‘‘కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పరిధిని నోటిఫై చేయడంపై చర్చ జరిగింది. ఆరేళ్లుగా వివాదాల కారణంగా వీటిని నోటిఫై చేయలేదు. ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎంల ఏకాభిప్రాయంతో వీటిని నోటిఫై చేస్తున్నాం. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌లపై డీపీఆర్‌లను సమర్పించడానికి ఇరురాష్ట్రాల సీఎంలు ఒప్పుకున్నారని’’ షెకావత్‌ వెల్లడించారు.  
 
 రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టుల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలు, ప్రాజెక్టుల నిర్వహణ, గోదావరి జలాలను సమర్థంగా వాడుకోవడం, కృష్ణా బోర్డు తరలింపు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించామని షెకావత్ తెలిపారు. 
 
జలాల పంపిణీకి సంబంధించి సుప్రీంలో ఉన్న కేసును ఉపసంహరించుకునేందుకు కేసీఆర్ అంగీకరించారని షెకావత్ వెల్లడించారు. 
 
కృష్ణా ట్రిబ్యున‌ల్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. ట్రిబ్యున‌ల్ ద్వారా నీటి కేటాయింపులు జ‌ర‌గాల‌ని సీఎం కేసీఆర్ కోరారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఓ ప‌రిష్కారానికి  వ‌చ్చామ‌ని కేంద్ర మంత్రి తెలిపారు. 
విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అన్ని నిర్ణయాలు తీసుకుంటామ‌ని ఆయన స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారని తెలిపారు.
 జల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్‌ ఒప్పుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఈ అంశంపై ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని చెప్పామని షెకావత్‌ తెలిపారు. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని ఆయన పేర్కొన్నారు.
 
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు స‌మ‌యంలో విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అపెక్స్ కౌన్సిల్ ఏర్ప‌డింది. చ‌ట్టం ప్ర‌కారం కృష్ణా న‌దీ జ‌లాల బోర్డు ఏర్పాటైంద‌ని తెలిపారు. 2016లో మొద‌టి అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది.
నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ రెండోసారి కౌన్సిల్ భేటీ అయింది. ఏడాదికి ఒక‌సారైనా అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించాలి. నాగార్జున సాగ‌ర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌పై చ‌ట్ట ప్ర‌కార‌మే ముందుకెళ్తామని కేంద్ర మంత్రి తెలిపారు.