
కేంద్రంలో ఎల్‌జెపి తమ భాగస్వామి అయినప్పటికీ బీహార్ లో బీహార్‌కు సంబంధించి ఎన్‌డిఎకు నాయకత్వం వహించేది నితీష్‌కుమార్ అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని, ఆ పార్టీతో తమ అనుబంధం విడదీయరానిదని బిజెపి బీహార్ నేత సంజయ్ జైస్వాల్ స్పష్టం చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి-జెడియులు మంగళవారం సీట్ల పంపకాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 243 సీట్లలో జెడియు 122 సీట్ల తోను, బిజెపి 121 సీట్ల తోను పోటీ చేస్తాయని అధికార ఎన్‌డిఎ వెల్లడించింది.
ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నాయకత్వానికి బిజెపి మద్దతు పలకగా, తిరుగుబాటు చేసిన ఎల్‌జెపి నేత చిరాగ్ పాశ్వాన్‌ను మందలించింది. జెడియు, బిజెపి అగ్రనేతలు ఈమేరకు సంయుక్తంగా పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు.
నితీష్‌కుమారే తమ ముఖ్యమంత్రి అవుతారని, ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందనేది ఇక్కడ ప్రధానం కాదని బిజెపి నేత, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చిరాగ్ చేసిన ప్రకటనను ఆయన తోసిపుచ్చారు. ఆయన తండ్రి కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ క్రియాశీలకంగా ఉంటే ఇలా జరిగేది కాదని చెప్పుకొచ్చారు.
ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ముందుకు తెస్తుందన్న వార్తలను ఆయన ఖండించారు. ‘‘మా సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే. సంఖ్యల పరంగా ఫలితం ఏదైనా కావచ్చు. సీఎం అభ్యర్థిత్వం విషయంలో మేము చిరాగ్ ను ప్రోత్సహించలేదు. ఎన్డీఏలో ఎవరు భాగస్వామ్యులున్నా…. నితీశ్ కుమార్‌నే సీఎం అభ్యర్థిగా అంగీకరించాల్సిందే.’’ అని సుశీల్ మోదీ తేల్చి చెప్పారు.
రెండు పార్టీలు దాదాపు సమాన సీట్ల భాగస్వామ్యంతో పోటీకి దిగినట్టు నితీష్ కుమార్ ప్రకటించారు. జెడియు 122 సీట్లను పొందిందని, వీటిలో ఏడు సీట్లు హిందుస్తానీ అవామ్ మోర్చా (మాజీ సిఎం జితన్ రామ్ మంఝీ నాయకత్వ పార్టీ)కు కేటాయించామని వివరించారు. మిగతా 121 సీట్లు పొందిన బిజెపి కొత్తగా ప్రవేశించిన ముఖేష్ సాహ్నికి చెందిన వికాష్షీల్ ఇన్‌సాన్ పార్టీ కి సీట్ల సర్దుబాటు చేస్తుందని వివరించారు.
చిరాగ్ పేరు ప్రస్తావించకుండా నితీష్‌కుమార్ వ్యంగ్యంగా చిరాగ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కొందరు బయట ఇది అసంభవమని చెబుతూ ఆనందం పొందుతున్నారని, ఆ విధంగా వారు చేయాలనుకుంటే స్వాగతిస్తానని, కానీ తాను చేస్తున్న విధినే నమ్ముతానని పరోక్షంగా చిరాగ్‌ను దృష్టిలో పెట్టుకుని నితీష్ వ్యాఖ్యానించారు.
జెడియు రాష్ట్రంలో తమ మిత్ర పక్షాలతో భాగస్వామ్య పార్టీలుగా సరిగ్గా చూడలేదని చిరాగ్ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ జెడియు మద్దతు లేకుండా రాజ్యసభకు రామ్ విలాస్ పాశ్వాన్ ఎన్నికయ్యారా ? అని నితీష్‌కుమార్ ప్రశ్నించారు.
More Stories
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
వియత్నాంపై రాహుల్ కు అంత ప్రేమ ఎందుకో?
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేక్ – రీ సర్వేకు ఆదేశం