దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందనరావు 

దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందనరావు 

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పార్టీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌‌రావును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రకటన చేసింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. 

ఇక్కడ టీఆర్‌‌ఎస్‌‌  తమ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాతను ప్రకటించగా, కాంగ్రెస్‌‌ పార్టీ అధికార పార్టీ నుండి వచ్చి చేరిన చెరుకు శ్రీనివాస్‌‌రెడ్డి పేరును ఖరారు చేసింది. రఘునందన్రావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. అప్పటి నుంచీ తన కేడర్ను బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టారు. 

ఉప ఎన్నిక జరగనుండటంతో రెండు నెలలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. న్యాయవాదిగా, మంచి వక్తగా పేరున్న రఘునందన్‌‌రావుకు నియోజకవర్గంలో చాలా పరిచయాలున్నాయి. 

వాస్తవానికి దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ తరఫున పోటీకి పలువురు నేతలు ఆసక్తి చూపారు. అయితే రెండు నెలలుగా ప్రచారంలో ఉండటం, అధికార పార్టీకి దీటైన అభ్యర్థిగా ప్రజల నుంచి ఫీడ్‌‌బ్యాక్‌‌ రావడంతో రఘునందన్‌‌రావు వైపే పార్టీ నాయకత్వం మొగ్గు  చూపిన్నట్లు తెలుస్తున్నది.

ఇలా ఉండగా, రఘునందన్‌‌రావును అరెస్టు చేయొద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఒక భూవివాదంలో సిద్దిపేట జిల్లా రాయపోల్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ రఘునందన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 

అన్యాయంగా పెట్టిన కేసును కొట్టేయాలని, ఈలోగా పోలీసులు అరెస్ట్‌‌ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.  ఈ నెల 12న  తదుపరి విచారణ చేపడతామని, అప్పటి వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.