లాలూ కుమారులపై హత్యా కేసు 

లాలూ కుమారులపై హత్యా కేసు 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్‌జేడీ కీలక నేత‌ల‌పై హ‌త్యారోప‌ణ‌లు రావ‌డం ఆ పార్టీవ‌ర్గాల్లో కలకలం రేపుతున్నది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్‌ యాదవ్‌ కుమారులు తేజస్వీ యాదవ్‌, తేజ్ ప్రతాప్ యాదవ్‌ల‌పై హ‌త్య‌కేసు న‌మోదైంది.

వీరితో పాటు ఆర్‌జేడీ నేత‌లు అనిల్ కుమార్ సాధు, కలో పాస్వాన్లతో పాటు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. అక్టోబ‌ర్‌ 4న (నిన్న‌)  బిహార్ లోని పూర్నియా జిల్లాలోని మాలిక్ (37) ఇంట్లోకి చొర‌బ‌డిన దుండ‌గులు అత‌న్ని కాల్చి చంపారు. ఆసుప‌త్రికి తీసుకెళ్లేలోపే ఆయ‌న మాలిక్ చ‌నిపోయిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు.

ఈ ఉదంతం వెనుక కుట్రకోణం దాగుంద‌ని, దీన్ని రాజ‌కీయ‌ హత్య‌గా మాలిక్ భార్య ఆరోపించారు. ఇంత‌కుముందు ఆర్‌జేడీ నుంచి మాలిక్‌ను స‌స్పెండ్ చేసిన కార‌ణంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయ‌న‌ నిర్ణయించుకున్నారు  .

పార్టీ టికెట్ కేటాయించ‌డానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ రూ.50 లక్షలు డిమాండ్ చేసిన‌ట్లు కొన్ని రోజుల‌క్రితం మాలిక్ ఓ వీడియో విడుదల చేశారు. తన‌ను కులం పేరిట తేజశ్వి యాదవ్ దూషించిన‌ట్లు సైతం మాలిక్ వీడియోలో వెల్ల‌డించారు. 

ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి దిగాల‌ని అనుకున్న తుర‌ణంలోనే ఇలా హ‌త్య‌కు గురికావ‌డం ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తుంది. మాలిక్ హ‌త్య‌కేసులో త్వ‌ర‌లోనే నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని ఎస్పీ విశాల్ శర్మ తెలిపారు. 

మాలిక్ శ‌రీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయ‌ని, సంఘ‌ట‌నా స్థ‌లంలో ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు వివ‌రించారు. కాగా బిహార్ ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యంతో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు తేజశ్వి యాదవ్ త‌న అస‌లు రంగు బ‌య‌ట‌పెట్టాడ‌ని జేడీ(యు) ఆరోపించింది.