పాక్‌‌తో కలసి చైనా వచ్చినా యుద్ధానికి రెడీ

దాయాది పాకిస్తాన్‌‌తో కలసి చైనా యుద్ధానికి కాలు దువ్వితే దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌‌కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌‌లతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో భదౌరియా స్పందించారు. ఎటువంటి విప‌త్తు ఎదురైనా, దాన్ని ఎదుర్కొనేందుకు బ‌ల‌మైన‌, స్థిర‌మైన రీతిలో ద‌ళాల‌ను మోహ‌రించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 
 
‘లడఖ్‌లో చైనా ఏం చేస్తుందనే దాన్ని మేం మే నెలలో గుర్తించాం. డ్రాగన్ ఎత్తుగడను పసిగట్టిన వెంటనే భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చాలా త్వరగా స్పందించాయి. పాకిస్తాన్‌‌, చైనా కలసి పని చేస్తున్నాయి. పలు విషయాల్లో చైనా మీద పాకిస్తాన్ ఆధారపడింది’ అని పేర్కొన్నారు. 
 
యుద్ధం అనేది వస్తే బలమైన భారత్ (ప్రత్యర్థి)ను చైనా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని చెబుతూ కీలకమైన ప్రాంతాల్లో మన సైనికులను మోహరించాయని తెలిపారు. `లడఖ్ చాలా చిన్న ప్రాంతం. ఏ యుద్ధానికైనా మేం సంసిద్ధంగానే ఉన్నాం’ అని భదౌరియా పేర్కొన్నారు.  
భ‌విష్యుత్తులో ఎటువంటి యుద్ధం వ‌చ్చినా.. దాంట్లో విజ‌యం సాధించే రీతిలో మ‌న ద‌ళాలు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. పొరుగు దేశాల నుంచి ప్ర‌మాదం పొంచి ఉన్న నేప‌థ్యంలో.. యుద్ధ సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌రుచుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని పేర్కొన్నారు.
యుద్ధ విమానాలైన రాఫేల్స్‌, చినూక్‌లు, అపాచీలను అతి త‌క్కువ స‌మ‌యంలో ఆప‌రేట్ చేశామ‌ని, రానున్న మూడేళ్ల‌లో రాఫేల్స్‌, ఎల్‌సీఏ మార్క్ 1 స్క్వాడ్ర‌న్లు పూర్తి సామ‌ర్థ్యంతో ప‌నిచేయనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.   ప్ర‌స్తుతం ఉన్న వైమానిక శ‌క్తికి మిగ్‌-29 తోడ్పాటు ఉంటుంద‌ని తెలిపారు.
స‌మ‌ర సామ‌ర్ధ్యాన్ని, విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని,  ఆధునీక‌ర‌ణ‌, ఆప‌రేష‌న‌ల్ ట్రైనింగ్‌, స్వ‌దేశీ ఆయుధాల వినియోగాన్ని పెంచ‌డం వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ భ‌దౌరియా తెలిపారు.
లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాల‌పై న‌మ్మ‌కాన్ని పెంచుకున్నామ‌ని, రానున్న అయిదేళ్ల‌లో మ‌రో 83 ఎల్‌సీఏ మార్క్ 1 విమానాల‌కు ఆర్డ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  స్వ‌దేశీ ఉత్ప‌త్తిలో డీఆర్‌డీవో, హెచ్ఏఎల్‌కు స‌పోర్ట్ ఇస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  హెచ్‌టీటీ40, లైట్ కంబాట్ హెలికాప్ట‌ర్ల‌కు సంబంధించి త్వ‌ర‌లో ఒప్పందం చేసుకోనున్న‌ట్లు తెలిపారు.