రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ 

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో అమాయక రైతులను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రయోజనాలను ఎవరు కాపాడుతున్నారో రైతులకు బాగా తెలుసునని స్పష్టం చేశారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. 

రైతుల సౌభాగ్యం కోసం కాంగ్రెస్ సమగ్ర చర్యలేవీ తీసుకోలేదని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతుల ప్రయోజనాల కోసం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని కొనియాడారు. అంతేకాకుండా రైతులకు రికార్డు స్థాయిలో నష్టపరిహారం చెల్లించారని చెప్పారు. 

కృషి అనే పదంలోని ‘కే’ని అయినా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అర్థం చేసుకోలేరని దుయ్యబట్టారు. పంజాబ్, హర్యానాలలో పర్యటించేందుకు వస్తున్న రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాల గురించి పూర్తిగా తెలియదన్నారు. 

ఇప్పుడు ఆమోదం పొందిన మూడు చట్టాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సమర్పించిన నివేదికలో ఓపెన్ మార్కెట్‌ను ప్రతిపాదించిందని గుర్తు చేశారు.