హత్రాస్‌‌లో ఉద్రిక్తత, రాహుల్, ప్రియాంక అరెస్ట్

ఉత్తర్ ప్రదేశ్‌‌లోని హత్రాస్‌‌కు బయల్దేరిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పోలీసులు అడ్డుకున్నారు. అత్యాచారానికి గురైన యువతి కుటుంబీకులను కలవడానికి వెళ్తున్న రాహుల్ కాన్వాయ్‌‌ను పోలీసులు నిలిపివేశారు. దీంతో రోడ్డు మార్గంలో రాహుల్, ప్రియాంక నడక ప్రారంభించారు. 
 
వందలాది పార్టీ మద్దతుదారులతో కాలినడకన వెళ్తున్న రాహుల్‌‌‌, ప్రియాంకను పోలీసులు మళ్లీ అడ్డుకొని అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని రాహుల్ ఆరోపించారు. సెక్ష‌న్ 188 కింద రాహుల్‌, ప్రియాంకాల‌ను అరెస్టు చేశారు.
 
‘నన్ను ఓ పోలీసు నెట్టేశాడు. నాపై లాఠీచార్జ్ చేసి కింద పడేశారు. నేనొక్కటే అడగదల్చుకున్నా.. ఈ దేశంలో కేవలం మోదీజీ  ఒక్కరే నడవాలా? మామూలు వ్యక్తులు నడవొద్దా? మా వాహనాలను ఆపేశారు. దీంతో మేం నడుచుకుంటూ వెళ్లాం. నన్ను ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారో చెప్పాలి’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఉత్తర్ ప్రదేశ్‌‌లోని హత్రాస్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల యువతిపై అదే ఊరికి చెందిన అగ్ర కుల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి వెన్నుపూస, ఇతర ఎముకలు విరిగేలా దారుణంగా కొట్టడంతో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. 
 
మరోవైపు పోలీసులు అర్థరాత్రి వేళ ఆ యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం వివాదానికి దారి తీసింది. తమను ఇంట్లో నిర్బంధించి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే యువతి తండ్రి, సోదరుడి అనుమతితోనే రాత్రివేళ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని పలు రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి.
 
హత్రాస్‌లో సామూహిక లైంగిక దాడికి గురై మరణించిన యువతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఇల్లు, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. 
‌యువ‌తిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ‌ట‌మేగాక నాలుక కోసి ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన నేర‌గాళ్ల‌ను విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్ప‌ష్టంచేశారు. ఈ దారుణ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కోసం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న చెప్పారు.
ఈ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపి వారం రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించ‌నుంద‌ని యోగీ తెలిపారు. ఈ కేసులో బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని యోడీ ఆదిత్య‌నాథ్ హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెప్పారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌ధాని కూడా త‌న‌ను ఆదేశించార‌ని యోగీ తెలిపారు.