వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌

వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (71)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. మంగళవారం ఉదయం ఆయన కొవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నారు. 
కాగా, ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు  ఉపరాష్ట్రపతి కార్యాలయం‌ ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ నెల 24తో ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రాజ్యసభ చైర్మన్‌ హోదాలో వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
 
దాంతో సభలో ఉన్నవారిలో ఇంకెవరికైనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభ సిబ్బందిలో 83 మందికి, ఉపరాష్ట్రపతి కార్యాలయ సిబ్బందిలో 13 మందికి కరోనా సోకింది. 
 
కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంకయ్య నాయుడు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. అలాగే, ఆయన సతీమణి ఉషా నాయుడు కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా, నెగెటివ్‌ వచ్చింది.    ప్రస్తుతం ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.
 
ఇలా ఉండగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు. గత ‍కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు.