బిజెపి నేతలపై అభ్యంతరకర పోస్టర్లు 

బిజెపి నేతలపై అభ్యంతరకర పోస్టర్లు 

బీజేపీ నేతలపై ‘‘అభ్యంతరకర పోస్టర్లు’’ అతికించిన ఓ సమాజ్‌వాదీ పార్టీ అనుబంధ సంస్థ కార్యకర్తలపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పెట్టిన ఈ పోస్టర్లను వెంటనే తొలగించివేశారు. 

మహిళలను వేధించిన వారికి బుద్ధిచెప్పే విధంగా వారి ఫోటోలతో రోడ్లపై పోస్టర్లు వేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఈ మేరకు స్పందించింది. 

పోస్టర్లలో ఉన్న కొందరు బీజేపీ వ్యక్తులు పలు అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్నారని సమాజ్వాదీ పార్టీ యువజన సభ సదరు పోస్టర్లలో ఆరోపించింది. కాగా వీటిని ఏర్పాటు చేసిన కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్టు అజాంగఢ్ ఎస్పీ సుధీర్ సింగ్ తెలిపారు. 

అభ్యంతకర పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అజాంగఢ్ ఎంపీగా కొనసాగుతున్నారు.

కాగా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఫోటోలతో రోడ్లపై పోస్టర్లు ఏర్పాటు చేయాలంటూ యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గత వారంలో ఆదేశాలు జారీ చేసింది. 

మహిళల్లో మనోధైర్యం నింపేందుకు, లైంగిక వేధింపులకు చెక్ పెట్టేందుకే  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలకు వ్యతిరేకంగా నేరం జరిగితే సంబంధిత ప్రాంతంలోని ఎస్‌హెచ్‌వో, సర్కిల్ అధికారులనే బాధ్యులను చేస్తామని సీఎం యోగి స్పష్టం చేశారు.