జలకళ ద్వారా రైతులకు ఉచిత బోర్లు

‘వైఎస్సార్‌ జలకళ’ ద్వారా రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని, ఒకసారి నీరు అందకపోతే రెండోబోరుకు అవకాశం కల్పిస్తున్నామనిముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు. సన్న, చిన్నకారు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బోర్లు వేసేందుకు రూపొందించిన వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని సోమవారం సిఎం జగన్‌ ప్రారంభించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 163 బోరు యంత్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెబుతూ సుమారు రెండు లక్షల బోర్లు తవ్వుతామని జగన్ తెలిపారు. దీనికోసం వచ్చే నాలుగేళ్లలో రూ.2,340 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. అలాగే మోటార్లు బిగిస్తామని, వాటికి రూ.1600 కోట్లు అదనంగా అవుతుందని, అయినా వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. 

రైతులు ఆన్‌లైన్లోగానీ, వాలంటీర్ల ద్వారాగానీ నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సర్వే అనంతరం బోరు తవ్వుతారని, ఒకవేళ నీరు పడకపోతే రెండో బోరు కూడా వేయాలని చెప్పామన్నారు. రాష్ట్రంలో 18 లక్షల మోటార్లు ఉన్నాయని, వాటి సగటు సామర్థ్యం ఆధారంగా ప్రతి బోరుకూ రూ.9274 ఖర్చవుతుందని తెలిపారు. 

నిరంతరం నీటి లభ్యత ఉంటే వలసలు కూడా తగ్గుతాయని తెలిపారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.8,655 కోట్లను చెల్లించామని చెప్పారు. పగటిపూటే రైతులకు ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని తెలిపారు. దీనికోసం ఫీడర్ల కెపాసిటీ పెంచామని, రూ.1700 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 

రైతులకు ఎంతలోడు కావాలన్నది తెలుసుకోవడం కోసమే మీటర్లు పెడుతున్నామని, నాణ్యమైన ఉచిత విద్యుత్‌ హక్కుగా కల్పిస్తామని చెప్పారు. పదివేల మోగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల యూనిట్‌ రూ.2.50 పైసలకు వస్తుందని, భారం కూడా పడదని తెలిపారు.

కాగా, ఈ క్రాపింగ్‌ పద్ధతిలో పొలాల వద్దే పంటల కొనుగోలు చేస్తామని జగన్ వెల్లడించారు. రాబోయే ఏడాదిలో ఆర్‌బికెల వద్ద గోదాములు, క్వాలిటీ నిర్ధారణకు అసైన్డ్‌ ఎక్విప్‌మెంటు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్రతి గ్రామంలోనూ జనతా బజార్ల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వీటిల్లో చేపలు కూడా అమ్ముతారని చెప్పారు. 

ఉచిత విద్యుత్‌ కోసం డబ్బు వసూలు చేస్తున్నారంటున్న వారిని రైతులు నిలదీయాలని సూచించారు. అలాగే రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు, రూ.384 కోట్ల విత్తన సేకరణ బకాయిలు కట్టామని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చిన సిఎంను తొలిసారి చూస్తున్నానని తెలిపారు.