
త్వరలో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేసిన తిరుపతి లోక్ సభ సీట్ కు ఉపఎన్నిక జరుగనున్న సమయంలో అదే నియోజకవర్గానికి చెందిన దళిత్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలోనే ఇటీవల జరిగిన అవమానం వైరల్ వలే ప్రచారం పొందుతున్నది.
ఏపీలో దళితులు మూకుమ్మడిగా ఓట్లువేసి అఖండ విజయం సాధించడానికి వెన్నుదన్నుగా నిలిచిన షెడ్యూల్డ్ కులాల నేతల పట్ల ముఖ్యమంత్రి సహన ధోరణి ఆవలంభిస్తున్నట్లు సొంతపార్టీలోనే గుసగుసలు బైలుదేరాయి.
గతవారం తిరుమలలో కర్ణాటక సత్రాల శంకుస్థాపన సభలో ప్రోటోకాల్ ఉల్లంఘించి కేవలం అగ్ర కులాలకు చెందినవారికే ప్రాధాన్యత ఇచ్చి, ఉపముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామిని నుంచోనేటట్లు చేసారని గుర్తు చేస్తున్నారు.
ప్రోటోకాల్ ప్రకారం ఇరువురు ముఖ్యమంత్రులతో పాటు ఉపముఖ్యమంత్రి కూడా కూర్చుండవలసి ఉండగా వారి వెనుకే కార్యక్రమం పూర్తయినంతవరకూ నిలబడేటట్లు చేశారు. అయితే అదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి లకు మాత్రం కుర్చీలు వేశారు.
తాడేపల్లి ఇంట్లో వుండి 5 కిలోమీటర్ల దూరంలో అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన రిమోట్ తో చేసిన ముఖ్యమంత్రి తన తండ్రి విగ్రహావిష్కరణకు 500 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఇడుపులపాయ వెళ్లడంను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
అక్రమాస్తుల కేసులో సహనిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా వస్తే అపోలో యజమానితో దాదాపు ప్రతి రోజు మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి తన పార్టీకే చెందిన సీనియర్ దళిత్ రాజకీయ వేత్త, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా సోకి ఆస్పత్రిలో చేరి 20 రోజులకు పైగా చికిత్స పొందితే ఒక్కరోజు కూడా ఫోన్ చేసి పలకరించలేదని చెబుతున్నారు.
సీపీఎం కార్యదర్శి మధు మోకాలి ఆపరేషన్ జరిగితే తమ పార్టీ కాకపోయినా రెడ్డి కావడంతో ఇంటికెళ్లి పరామర్శ చేసి వచ్చిన ముఖ్యమంత్రి తన పార్టీ వాడే అయిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోయినా కనీసం తిరుపతి కార్యక్రమాలకు వచ్చినప్పుడైనా వారి కుటుంబసభ్యులను పరామర్శించలేదని గుర్తు చేస్తున్నారు.
More Stories
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
న్యాయస్థానాల పరిధిలో హైకోర్టు తరలింపు అంశం