సోనియాకు కేరళ కాంగ్రెస్ నేతల షాక్ 

సోనియాకు కేరళ కాంగ్రెస్ నేతల షాక్ 
వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కేరళలో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి షాక్ ఇచ్చారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై తమ అసమ్మతిని బహిర్గతం చేయడం ద్వారా పార్టీని సంక్షోభంలోకి నెట్టివేశారు. 
 
లోక్‌సభ ఎంపీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కన్వీనర్ బెన్నీ బెహానన్, కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశాలు లేకుండానే పార్టీకి రాజీనామా చేశారు. ఇక బెహానన్‌ పార్టీ నుంచి తప్పుకున్న కొద్ది సేపటికే మరొక ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కె. కరుణాకరన్‌ కుమారుడు కె. మురళీధరన్‌ కూడా  కేపీసీసీ మీడియా ప్రచార కమిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. 
 
తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు . 2018 సెప్టెంబర్‌లో కేపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆయన, 2019 సార్వత్రిక ఎన్నికలలో వటకర నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.  వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర నాయకత్వం వ్యతిరేకిస్తూ ఉండడంతో అసంతృప్తిగా ఉన్నారు. 
 
పార్టీకి మంచి సేవలందించాలంటే నాయకులు ఒకటి కంటే ఎక్కువ పదవులలో ఉండకూడదని కేపీసీసీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ సూచించిన తరువాత కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలోని ఒక విభాగం పార్లమెంటు సభ్యుడిగా ఉండటంతో పాటు బెహానన్  పార్టీ కన్వీనర్‌గా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాజీనామా చేసిన్నట్లు తెలుస్తున్నది. 
 

సీనియర్ నాయకుడు, మాజీ కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతో బెహానన్ భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారనితెలుస్తున్నది. 2018 లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు కన్వీనర్‌గా బెన్నీ బెహానన్ నియమితులయ్యారు. రాజీనామా తరువాత, మాజీ కేపీసీసీ అధ్యక్షుడు, ఊమెన్‌ చాందీ విధేయుడు ఎంఎం హసన్ ఈ పదవి చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.