దుబ్బాకలో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ధీటుగా బీజేపీ

దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉడడంతో అక్కడ గెలుపు కోసం అధికారంలో ఉన్న  టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ధీటుగా బిజెపి వేగం పెంచింది. ఆ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పార్టీ సీనియర్ నేతలను ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జీలుగా నియమించింది. పార్టీ టికెట్ తనకే దక్కుతుందనే నమ్మకంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు నియోజకవర్గమంతా కలియ తిరుగుతున్నారు.

పార్టీ జెండా ఆవిష్కరణ పేరుతో ఆయన పల్లెలను చుట్టి వస్తున్నారు. బీజేపీని గెలిపించాలని కోరుతూ పార్టీ రాష్ట్ర నేతలు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే  రాజాసింగ్ వంటి నేతలు అక్కడ పర్యటించి ప్రచారానికి ఊపు తెచ్చారు.

అధికార పార్టీకి చెక్ పెట్టే రీతిలో  బీజేపీ నేతలు కేంద్రంలో మోదీ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ లబ్ధిదారులను కలుస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ వెంటనే అభ్యర్థిని ప్రకటించే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది.

రఘునందన్ రావు 2018 ఎన్నికల్లో పోటీ చేసి 13 శాతం ఓట్లు పొందారు. ఈ ఎన్నికల్లో ఆయన మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్‌‌లో బీజేపీ రెండో స్థానంలో నిలిచి తన పట్టు పెంచుకుంది.

గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతికి తోడు అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు జనంలో ఎండగడుతున్న రఘునందన్‌‌‌‌‌‌‌‌కు యువతలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి రఘునందన్ రావే అని అంచనాకు వచ్చిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయన అభ్యర్థిత్వానికే మొగ్గు చూపనున్నట్లు ప్రచారం సాగుతోంది.

మండలాల వారీగా దుబ్బాక రూరల్‌‌‌‌‌‌‌‌కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి,   దుబ్బాక అర్బన్‌‌‌‌‌‌‌‌కు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ,   మిరుదొడ్డి మండలానికి మాజీ ఎంపీ చాడా సురేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి,    తోగుంటకు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, దౌల్తాబాద్‌‌‌‌‌‌‌‌కు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి,  రాయపోలుకు మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి,    చేగుంటకు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,  నర్సింగ్‌‌‌‌‌‌‌‌కు మాజీ మంత్రి విజయ రామారావు లను ఇన్‌‌‌‌‌‌‌‌చార్జీలుగా నియమించారు.