అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్.. భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. తమ సంస్థకు చెందిన అకౌంట్లను భారత ప్రభుత్వం ఫ్రీజ్ చేసినట్లు ఆమ్నెస్టీ పేర్కొన్నది. మానవ హక్కుల సంస్థను భారత ప్రభుత్వం వెంటాడుతోందని కూడా ఆమ్నెస్టీ తన ప్రకటనలో తీవ్ర ఆరోపణ చేసింది.
అకౌంట్లు ఫ్రీజ్ చేయడమే కాదు, తమ ఉద్యోగులను కూడా వెళ్లగొడుతున్నారని ఆ సంస్థ పేర్కొన్నది. దేశంలో నిర్వహిస్తున్న వివిధ రకాల ప్రచారాలు, పరిశోధనలను నిలిపివేస్తున్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థ విదేశాల నుంచి అక్రమ రీతిలో నిధులను సేకరిస్తున్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌పై ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
భారత్ లో పరిస్థితి దారుణంగా ఉందని, తమ సంస్థ వరుస దాడులను ఎదుర్కొంటోందని, చాలా వ్యవస్థీకృత పద్ధతిలో ప్రభుత్వం వేధిస్తున్నదని ఆమ్నెస్టీ డైరక్టర్ రజత్ కోస్లా తెలిపారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు వస్తున్న నిధులపై గత కొన్నేళ్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి. 2009లోనూ ఈ సంస్థ భారత్ లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. విదేశీ నిధులు స్వీకరించేందుకు లైసెన్సును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ సంస్థ తన కార్యకలాపాలను ఆపేసింది.
నేరుగా కాకుండా కన్సల్టెన్సీ పేరుతో ఆమ్నెస్టీ అంతర్జాతీయ కార్యాలయం నుండి భారీ ఎత్తున ఇక్కడ నిధులను సమీకరిస్తున్నట్లు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల విదేశీ నిధులకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినం చేయడంతో అక్రమంగా నిధుల సమీకరణ సాధ్యం కావడం లేదని తెలుస్తున్నది.
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’