ఇంటర్‌నెట్ వినియోగం విపరీతంగా పెరుగుతుండటంతో అదే రీతిలో అధికం అవుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులను మరోమారు హెచ్చరించింది.
ఇప్పటికే మెయిల్స్ ద్వారా తమ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నారని వెల్లడించిన ఎస్‌బీఐ తాజాగా వాట్సాప్ ద్వారా కూడా కస్టమర్లకు వల వేస్తున్నారని పేర్కొంది. లాటరీ గెలుచుకున్నారంటూ వాట్సాప్ కాల్స్ చేస్తారని, మోసపూరితమైన సందేశాలు పంపుతారని తెలిపింది.
అనంతరం ఫలానా ఎస్బీఐ నెంబర్ ను సంప్రదించాలంటూ నమ్మబలుకుతారని, ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తన కస్టమర్లను హెచ్చరించింది. ఎస్‌బీఐ ఈమెయిల్, ఎస్సెమ్మెస్, ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ ద్వారా ఎప్పుడూ ఖాతాదార్ల వ్యక్తిగత వివరాలు అడగదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు.
అంతేకాదు, లక్కీ కస్టమర్ గిఫ్టులు, లాటరీ స్కీములను తాము ఎక్కడా అమలు చేయడంలేదని, ఇలాంటి ప్రలోభాల్లో చిక్కుకునేముందు ఓసారి ఆలోచించాలని ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఖాతాదార్లు ఎప్పుడు తప్పు చేస్తారా అని సైబర్ నేరగాళ్లు కాచుకుని ఉంటారని ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని కస్టమర్లకు తెలిపింది. బ్యాంక్ లోపం కారణంగా వినియోగ దారుల డబ్బుపోతే బ్యాంక్ చెల్లిస్తుంది కానీ ఇలా వినియోదారుల నిర్లక్ష్యం కారణంగా పోతే బ్యాంక్‌కు సంబంధం ఉండదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ