
అప్పుల ఊబిలో కూరుకుపోయి, సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్‌వీబీ) రోజువారీ కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం ముగ్గురు సభ్యులతో కూడిన డైరెక్టర్ల కమిటీ (సీవోడీ)ని నియమించేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. మీటా మఖన్, శక్తి సిన్హా, సతీశ్‌కుమార్ కల్రా అనే ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన సీవోడీని నియమించినట్టు వెల్లడించింది.
మీటా మఖన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ ఎల్‌వీబీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోకు ఉండే విచక్షణాధికారాలను తాత్కాలికంగా ఉపయోగించుకుంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎల్‌వీబీలో ఏడుగురు డైరెక్టర్ల నియామకాన్ని శుక్రవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులు తిరస్కరించడంతో ఆ బ్యాంకు సంక్షోభంలో చిక్కుకున్నది.
తిరస్కరణకు గురైన నియామకాల్లో మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ సుందర్‌తోపాటు నాన్-ఎగ్జిక్యూటివ్, స్వతంత్రేతర డైరెక్టర్లు కేఆర్ ప్రదీప్, రఘురాజ్ గుజ్జర్, నాన్-ఎగ్జిక్యూటివ్ స్వతంత్ర డైరెక్టర్లు బీకే మంజునాథ్, జీ జగన్మోహన్‌రావు, వైఎన్ లక్ష్మీనారాయణమూర్తి ఉన్నారు.
ఈ సంక్షోభం నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లలో ఎల్‌వీబీ షేర్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒకానొక సమయంలో 6 శాతం వరకు నష్టపోయిన ఈ షేరు ధర చివరికి 1 శాతం కంటే తక్కువ నష్టంతో గట్కెక్కింది.
మూలధనాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎల్‌వీబీ.. విలీనం కోసం క్లిక్స్ గ్రూపుతో చర్చలు జరుపుతున్నది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ చర్చలు ఆలస్యం కావచ్చని జూలై 30వ తేదీన ఎల్‌వీబీ తెలిపింది. ఆ తర్వాత ఈ చర్చలకు సంబంధించిన ప్రత్యేక కాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.
సెప్టెబర్ 27 నాటికి ఎల్‌వీబీ లిక్విడిటీ కవరేజీ నిష్పత్తి (ఎల్‌సీఆర్) 262 శాతంగా ఉన్నది. బాసెల్-3 మార్గదర్శకాల ప్రకారం జూన్ 30వ తేదీ నాటికి ఎల్‌వీబీ మూలధన సమృద్ధి నిష్పత్తి (సీఏఆర్)ని 0.17 శాతానికి కుదించారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.112 కోట్లకుపైగా నష్టాన్ని నమోదు చేసిన ఎల్‌వీబీకి గతేడాది ఇదే కాలంలో రూ.237 కోట్లకుపైగా నష్టం వచ్చింది.
జూన్ త్రైమాసికం నాటికి ఎల్‌వీబీలో రూ.21,162 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇవి అంతకుముందు త్రైమాసికం కంటే 1.3 శాతం, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 27 శాతం తక్కువ. అయినప్పటికీ ద్రవ్య లభ్యతకు ఎలాంటి ఢోకా లేదని ఎల్‌వీబీ తమ డిపాజిటర్లకు భరోసా ఇచ్చింది.
More Stories
ముగ్గురితో వాణిజ్య ఒప్పందాలపై మాట్లాడుతున్నాం
వచ్చే ఐదేళ్లలో భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య రెట్టింపు
ఉల్లిపాయలపై 20 శాతం ఎగుమతి సుంకం ఉపసంహరణ