స్టెర్లింగ్ బయోటెక్ కేసులో నలుగురు నిందితులను ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం పారిపోయిన ఆర్థిక నేరస్తులుగా సోమవారం ప్రకటించింది. ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక నేరస్తులుగా ప్రకటించిన వారి జాబితాలో నితిన్ సందేసారా, చేతన్ సందేసారా, చేతన్ భార్య దీప్తి, హితేష్‌కుమార్ నరేంద్రభాయ్ పటేల్ ఉన్నారు.
కోర్టు తీర్పుతో వారి ఆస్తులను జప్తు చేసేందుకు ఇడికి మార్గం సుగమమవుతుంది.స్టెర్లింగ్ బయోటెక్‌తోపాటు ఇతరులపై సిబిఐ 2017, అక్టోబర్‌లో నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇడి మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతోంది.
పేర్లు వెల్లడి కాని ఐటి శాఖ అధికారులకు చెందిన వెల్లడికాని నిధులను రౌటింగ్ చేశారన్నది ఒక కేసులో దర్యాప్తు సంస్థల ఆరోపణ కాగా, మరో కేసు రూ.8,100 కోట్ల మేర బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించినది.
రూ.100 కోట్లకు పైగా మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలున్న కేసులో పారిపోయిన ఆర్థిక నేరస్తులుగా ప్రకటించిన వారి ప్రమేయం ఉందని ఇడి పేర్కొంది. 2018, అక్టోబర్ 25న కోర్టు వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ కేసులో కీలకమైన ఈ నలుగురు దేశం విడిచి వెళ్లిపోయారు. పలుమార్లు సమన్లు జారీ చేసినా విచారణ కోసం వారు తిరిగి రాలేదు.
More Stories
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఎన్నికల బాండ్ల పథకంపై తీర్పు సమీక్షకు `సుప్రీం’ నిరాకరణ