కాంగ్రెస్ నాయకత్వం మరుగుజ్జు నాయకత్వమని, మంచి పనులను వారికి కనిపించవు, వినిపించవని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తీవ్రంగా మండిపడ్డారు. దేశం కోసం మాట్లాడే వారి మాటలను కాంగ్రెస్ వినే పరిస్థితిలో లేదన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత దానిపై వివరణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందని, అయితే కాంగ్రెస్ సభలో గలాటా సృష్టించిందని ఆరోపించారు. సభ పట్ల, డిప్యూటీ చైర్మన్ పట్ల అప్రజాస్వామికంగా ప్రవర్తించారని, కార్యకలాపాలకు అడ్డురపడ్డారని దయ్యబట్టారు.
ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష నేతలు బిల్లులపై చర్చించలేదని, కేవలం రాజకీయాలకే పరిమితమైపోయారని ఆయన విమర్శించారు. ఈ బిల్లులతో కనీస మద్దతు ధర కచ్చితంగా ఉంటుందని దానికేమీ ఢోకా లేదని ఆయన భరోసా ఇచ్చారు.
పండిన పంటలను రైతులు మార్కెట్ తీసుకొచ్చే వారని, అక్కడ దళారులు ఎంత రేటు ఫిక్స్ చేస్తే అదే రేటు వుండేదని, కానీ నూతన బిల్లులతో పూర్తి మార్పులు వస్తాయని ప్రకటించారు. నూతన బిల్లులు వచ్చినప్పటికీ కనీస మద్దతు ధర అలాగే కొనసాగుతుందని, ఇప్పటికే కరీఫ్, రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచామని గుర్తు చేశారు.
కరీఫ్ పంట కోసిన వెంటనే ప్రభుత్వం తరపున ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిందని, కనీస మద్దతు ధరను ఎప్పుడైనా చట్టంలో భాగం చేశారా? అని ఆయన ప్రశ్నించారు.
తమను విమర్శించడానికి కాంగ్రెస్ వద్ద ఏ అస్త్రమూ లేదని, అందుకే ఈ విషయాన్ని పట్టుకుని చిలువలు, పలువలు చేస్తున్నారని తోమర్ మండిపడ్డారు.
More Stories
ఫలితాలతో బిజెపి ఫుల్ జోష్.. ఇక మహారాష్ట్ర, ఝార్ఖండ్ లపై దృష్టి
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ జఠిలమైన సమస్య
చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రె్స్ కు ‘నో ఎంట్రీ’ బోర్డు