ఆరోగ్యకరమైన ఆహారం మన జీవనవిధానంలో భాగమవడం సంతోషకరమని, చాలామంది అనుకునే విధంగా ఫిట్‌గా ఉండటం కష్టం కాదని, కొద్దిపాటి క్రమశిక్షణతో ఇది సాధ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఫిట్ ఇండియా ఉద్యమం తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని గురువారం దేశవ్యాప్తంగా ఫిట్‌నెస్ నిపుణులు, స్ఫూర్తిప్రదాతలతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఫిట్ ఇండియా ఫిట్‌నెస్ మార్గదర్శకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండేలా మరొకరిని ప్రభావితం చేయాలని సూచించారు. కుటుంబాలు కలిసిమెలిసి ఆడుతూపాడుతూ కలిసిమెలసి సాగాలని పిలుపు ఇచ్చారు. ఫిట్‌నెస్ కోసం ప్రతిరోజూ అరగంట కేటాయించాలని ప్రధాని సరికొత్త నినాదాన్ని ముందుకు తెచ్చారు.
ఈ కార్యక్రమంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, మోడల్, నటుడు, రన్నర్ మిలింద్ సొమన్, పోషకాహార నిపుణులు రుజుత దివాకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తాను శారీరకంగా ధృడంగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తానని ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. తాను ఒక్కరోజు ప్రాక్టీస్ చేయడం మానుకున్నా ఫిట్‌నెస్ సెషన్‌ను మాత్రం ఏ ఒక్కరోజూ మిస్ చేయనని స్పష్టం చేశారు.
ఫిట్‌నెస్ కోసం మీకు ఇష్టమైన ఛోలె బటూరెను మిస్సవుతున్నారని ప్రధానమంత్రి మోదీ చమత్కరించగా ఫిట్‌గా ఉండేదుకు మంచి ఆహారపు అలవాట్లు తప్పనిసరని కోహ్లీ అంగీకరించారు.
మన పూర్వీకులు ఇంటి వంటనే ఆస్వాదిస్తూ అరుదుగా రోగాల బారినపడేవారని, ప్రస్తుతం నగరాల్లో పెరుగుతున్న మనం అనారోగ్యకర ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటున్నామని ఐపీఎల్ టోర్నీ కోసం ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న కోహ్లా పేర్కొన్నారు.
తన శారీరక ఫిట్‌నెస్ కోసం తన ఆహార అలవాట్లను మార్చుకోవాల్సి ఉందని చెప్పారురు. మనం ఏం తింటున్నామో తెలుసుకోవాలని, మన ఫిట్‌నెస్ ప్లాన్‌కు అనుగుణమైన ఆహార ప్రణాళికను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
తొలుత పారాఒలింపిక్ జావెలన్ బంగారు పతక విజేత దేవేంద్ర జజారియా, ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్సన్ ఆషిక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సంక్లిష్ట సమయంలో చేతులు ఎత్తేయకుండా పోరాడాలని జజారియా పిలుపు ఇవ్వగా, ఉదయాన్నే నిద్రలేచి వర్క్‌అవుట్లు చేయడం ద్వారా దేశ మహిళలందరినీ ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేస్తానని ఆషిక్ పేర్కొన్నారు.
మానసికంగా ధృడసంకల్పం ఉంటే వందల కిలోమీటర్లు నడవడం సాధ్యమేనని మిలింద్ సొమన్ అన్నారు. ఫిట్‌గా తయారయ్యేందుకు విశాలమైన స్ధలం, జిమ్ అవసరం లేదని, సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింకులు లేకుండానే మనం ధృఢంగా మారవచ్చని చెప్పుకొచ్చారు.
ఆరోగ్యంగా జీవించడం అంటే సహజంగా ఉండే ఇంటి భోజనం తీసుకోవడమేనని పోషకాహార నిపుణులు రుజుత దివాకర్ చెప్పారు. ఆరోగ్యంతో రాజీపడకుండానే బరువు తగ్గడంపై దృష్టిసారించాలని అన్నారు. ప్యాకేజ్డ్ ఆహారాన్ని నివారిస్తే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుందని చెప్పారు.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’