జగన్ – చంద్రబాబులకు కీలకం తిరుపతి ఉపఎన్నిక!

తిరుపతి వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో ఆకస్మిక  మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఖాళీ అయిన సీటును భర్తీ చేయాల్సి ఉంటుంది.  అంటే వచ్చే ఏడాది మొదట్లో ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నిక జరిగితే ఏపీలోని ప్రధాన రాజకీయ పక్షాలకు కీలకం కానున్నది. 

ఏపీలో కొంత కాలంగా ఆకస్మికంగా ఎవరైనా మృతి చెందితే జరిగే ఉపఎన్నికలలో ఆ అభ్యర్థి కుటుంభం సభ్యులు ఎవరైనా నిలబడితే పోటీగా అభ్యర్థిని నిలబెట్టక పోవడం ఆనవాయితిగా వస్తున్నది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న `విద్వేష’ పూరిత రాజకీయాలలో ఏకగ్రీవ ఎన్నికకు అవకాశం లేకపోవచ్చు. 

ఈ ఎన్నిక సహజంగానే అధికార పక్షంపై ప్రతిష్టాకరం కాగలదు. ఒక విధంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాదిన్నర పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉపయోగపడుతుంది. మరోవంక ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు స్వస్థలం ఈ నియోజకవర్గంలో ఉండడంతో టిడిపికి కూడా సవాల్ కానున్నది. 

ఇక గతంలో ఒక పర్యాయం ఈ నియోజకవర్గంలో గెలుపొందిన బీజేపీ సహితం తమ బలాన్ని పరీక్షించుకునేందుకు పోటీ చేసేందుకు సిద్దపడుతున్నది. అందుకు జనసేన మద్దతు కోసం ప్రయత్నించాలని చూస్తున్నది. జనసేనకు సహితం ఈ నియోజకవర్గ పరిధిలో చెప్పుకోదగిన మద్దతు ఉంది. 

‘జగన్ సర్కారుపై విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ టీడీపీదే అధికారం. ఏపీ రాజధానిగా అమరావతికి అప్పుడు ఒప్పుకుని..ఇప్పుడు మూడు రాజధానులు అంటూ మోసం చేశారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మాట తప్పినందుకు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి.’ అంటూ తరచూ సవాళ్లు విసురుతున్న చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్ కు ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభంకు సన్నిహితుడైన తిరుపతి ఎమ్యెల్యే బి కరుణాకరరెడ్డికి అధికార పక్షం అభ్యర్థిని గెలిపించే బాధ్యత అప్పచెప్పే అవకాశం ఉంది. పైగా జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు, ఎమ్యెల్యే ఆర్కే రోజాకు సహితం కీలకం కానున్నది. ముఖ్యమంత్రి బాబాయి వైవి సుబ్బారెడ్డి టిటిడి బోర్డు చైర్మన్ గా ఉండడమే కాకుండా, చిత్తూర్ జిల్లా వైసిపి ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. 

గత ఎన్నికల తర్వాత ఒక విధంగా ఈ ప్రాంతంలో టిడిపి బలహీనమైనదని చెప్పవచ్చు. అందుకనే ఈ ఎన్నిక ఫలితాలు ఏపీ రాజకీయ భవిష్యత్ కు సూచికగా మారే అవకాశం ఉంది. యుపిఎ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి ఇప్పుడు టిడిపి అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్దపడుతున్నది. బీజేపీ- జనసేన కలయిక ఓటర్లపై ఏ మాత్రం ప్రభావం చూపగలదో అనే అంశంకు కూడా ఈ ఎన్నికలు ఒక కొలమాణంగా మారగలదు. 

సహజంగా ఉపఎన్నికలు అధికార పక్షంకు అనుకూలంగా ఉండగలదు. 2019లో బల్లి దుర్గాప్రసాద్ కు 228,376 ఓట్ల మెజారిటీ రావడంతో ఈ పర్యాయం కూడా వైసిపి గెలుపుపై ధీమాతో ఉంటుంది. అయితే ఉపఎన్నికలు జరిగే సమయంలోనే దాదాపుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న మునిసిపల్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. 

దానితో ఒక విధంగా జగన్ పాలనపై ప్రజల తీర్పుగా ఎన్నికలు మారే అవకాశం ఉంది. తిరుపతి లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు నెల్లూరు జిల్లాలో ఉండగా, మరో మూడు నియోజకవర్గాలు  చిత్తూరు  జిల్లాలో ఉన్నాయి.  దానితో ఈ ఉపఎన్నిక ఈ రెండు జిల్లారాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి.